Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్‌!

జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోన్న ఓ ప్రైవేటు ఉద్యోగికి ఊహించని పరిణామం ఎదురయ్యింది. నెల జీతం(Monthly Salary) చూసుకున్న అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎప్పుడూ వచ్చే దానికన్నా వందల రెట్లు ఎక్కువ వేతనం...

Published : 02 Jul 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోన్న ఓ ప్రైవేటు ఉద్యోగికి ఊహించని పరిణామం ఎదురయ్యింది. నెల జీతం (Monthly Salary) చూసుకున్న అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎప్పుడూ వచ్చే దానికన్నా వందల రెట్లు ఎక్కువ వేతనం.. బ్యాంకు ఖాతాలో జమ కావడంతో ఆనందంతో పొంగిపోయాడు. తీరా.. తన సాంకేతిక తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరడంతో అతను చివరకు రాజీనామా చేసి కనిపించకుండా పోయాడు. ఈ వ్యవహారం చిలీ(Chile)లో వెలుగు చూసింది.

చిలీకి చెందిన ఓ వ్యక్తి అక్కడి ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థలో పనిచేస్తున్నాడు. అతడి నెలవారీ జీతం దాదాపు రూ.43 వేలు(చిలీ కరెన్సీలో 5లక్షల పెసోస్‌). కానీ, మే నెల జీతం చూసుకునేసరికి అతని మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఖాతాలో ఏకంగా రూ.1.42 కోట్ల జీతం (16,53,98,851 పెసోలు) జమయ్యింది. అది అతని జీతంతో పోలిస్తే దాదాపు 286 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే, ఖాతాలను సరిచూసుకునే సమయంలో తప్పిదం జరిగినట్లు గుర్తించిన సదరు కంపెనీ.. ఆ ఉద్యోగిని సంప్రదించింది. జీతం కంటే అదనంగా పడిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించింది.

తొలుత కంపెనీ విజ్ఞప్తికి అంగీకరించిన ఆ ఉద్యోగి అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ, వాటిని బ్యాంకులో మాత్రం జమ చేయలేదు. దీంతో కంపెనీ యాజమాన్యం అతన్ని సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. రెండు, మూడు రోజులకు మరోసారి అందుబాటులోకి వచ్చిన ఆ ఉద్యోగి.. వెంటనే ఆ మొత్తాన్ని బ్యాంకులో వేస్తున్నట్లు కంపెనీకి తెలియజేశాడు. కానీ, చివరకు జూన్‌ 2న రాజీనామా లేఖను సమర్పించి ఎవ్వరికీ కనిపించకుండా పోయాడు. దీంతో కంపెనీ యాజమాన్యం.. అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని