15ఏళ్ల వయసులో నేరం..68ఏళ్లు జైల్లోనే!

మనుషులు తెలిసీ తెలియని వయసులో చేసే కొన్ని తప్పులు.. జీవిత కాలం ప్రభావం చూపిస్తాయని అంటుంటారు. అలాంటి ఘటనే అమెరికాలో ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకుంది. జో లైగన్‌ అనే వ్యక్తి టీనేజీలో చేసిన నేరం..

Published : 20 Feb 2021 15:21 IST

వాషింగ్టన్‌: మనుషులు తెలిసీ తెలియని వయసులో చేసే కొన్ని తప్పులు.. జీవిత కాలం ప్రభావం చూపిస్తాయని అంటుంటారు. అలాంటి ఘటనే అమెరికాలో ఓ వ్యక్తి జీవితంలో చోటుచేసుకుంది. జో లైగన్‌ అనే వ్యక్తి టీనేజీలో చేసిన నేరం కారణంగా 68ఏళ్ల పాటు జైలు జీవితాన్ని అనుభవించి.. అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం జైలు జీవితాన్ని అనుభవించిన వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తి గతవారమే జైలు నుంచి విడుదలై కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు. 

అది 1953, ఫిబ్రవరి. అప్పుడు అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన జో లైగన్‌ వయసు 15 ఏళ్లు. తెలిసీ తెలియని ఆ వయసులో లైగన్‌ ఓ నేరానికి పాల్పడ్డాడు. మరో నలుగురు టీనేజీ కుర్రాళ్లతో కలిసి దోపిడీలో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి. వారి ముఠా చేసిన దోపిడీ ఘటన ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసింది. మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. దీంతో పోలీసులు లైగన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం లైగన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఆదేశించింది. దీంతో లైగన్‌ 15ఏళ్ల వయసులోనే జైలు జీవితంలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జైలుకు వెళ్లిన ఆ వ్యక్తి ఇప్పుడు 83ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. 

లైగన్‌ విడుదలైన తర్వాత ఆయన తరపు న్యాయవాది బ్రిడ్జ్‌ మాట్లాడుతూ.. ‘1953లో నేరం చేసిన విషయంలో జైలు కెళ్లిన ఆ వ్యక్తి.. 83 ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. అతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఇక ఎలాంటి ముప్పు లేదు. సమాజానికి అతడు చేసిన నష్టానికి తగిన రీతిలో తిరిగి చెల్లించుకున్నాడు. ఇప్పుడు లైగన్‌ తన జీవిత వృద్ధాప్య దశను స్వేచ్ఛగా జీవించవచ్చు. తొలుత 1970లో పెన్సిల్వేనియా గవర్నర్‌ నుంచి లైగన్‌కు క్షమాభిక్ష అవకాశం వచ్చింది. కానీ దాన్ని లైగన్‌ తిరస్కరించాడు. 2017లో వచ్చిన పెరోల్‌ అవకాశాన్ని తిరస్కరించాడు. ఆ విధంగా బయటకు వెళ్లడం ద్వారా తనకు స్వేచ్ఛ ఉండదని ఆయన నమ్మారు. అందుకే వాటిని తిరస్కరించారు’ అని బ్రిడ్జ్‌ వివరించారు. 

బ్రిడ్జి గత దశాబ్దం కాలంగా లైగన్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కేసును ఫెడరల్‌ కోర్టులో వాదించి 2021లో ఆయన్ను విడుదల చేయించడంలో కీలకపాత్ర పోషించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని