Cyclone Mandous: తరుముకొస్తున్న మాండౌస్‌ తుపాను.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

తీవ్ర తుపానుగా మారిన మాండౌస్‌ దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Updated : 09 Dec 2022 19:52 IST

అమరావతి: తీవ్ర తుపానుగా మారిన మాండౌస్‌ దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను తీవ్రతను అంచనా వేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తీవ్ర తుపానుగా కొనసాగుతున్న మాండౌస్‌ మరి కొన్ని గంటల్లో బలహీనపడి పుదుచ్చేరి-శ్రీహరి కోట మధ్య తీరం దాటే అవకాశముంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా, అనంతరం వాయుగుండంగా.. అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపారు.

తిరుమలలో భక్తుల అవస్థలు..

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాండౌస్‌ తుపాను ప్రభావం కనిపిస్తోంది. తిరుపతిలో జోరు వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం పడింది. 
శ్రీవారి దర్శనం అనంతరం గదులకు వెళ్లే భక్తులు అవస్థలు పడ్డారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు కనుమదారుల్లో వెళ్లే వాహనదారులను తితిదే విజిలెన్స్‌ విభాగం అప్రమత్తం చేస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, గూడూరు నియోకవర్గాల పరిధిలోని తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 

పాఠశాలలకు సెలవు..

నెల్లూరు జిల్లాలో చలిగాలులు వీస్తున్నాయి. వాకాడు వద్ద సముద్రం 50మీటర్ల ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చక్రధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. 

అన్నమయ్య జిల్లాలో..

అన్నమయ్య జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని కలెక్టర్‌ గిరీషా చెప్పారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల దిగువున ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలాలు, డివిజన్‌, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ సచివాలయాలు, పాఠశాల భవనాల్లో పునరావాసానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని