Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా

ఓ యువకుడికి ఇచ్చిన హామీని ఆనంద్‌ మహీంద్రా నెరవేర్చారు. వ్యర్థ పదార్థాలను వినియోగించి ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ నమూనాను తయారు చేసిన ఓ యువకుడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనున్నారు.....

Published : 02 Oct 2021 01:37 IST

సాకారం కానున్న యువకుడి కల

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.. ప్రతిభను గల యువత గురించి ప్రస్తావిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. వారి టాలెంట్‌ బయటి ప్రపంచానికి తెలిసేలా సహాయం చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం ఓ యువకుడికి ఇచ్చిన హామీని తాజాగా ఆయన నెరవేర్చారు. వ్యర్థ పదార్థాలను వినియోగించి ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ నమూనాను తయారు చేసిన ఓ యువకుడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయనున్నారు. వ్యర్థ పదార్థాలను వినియోగించి.. ఐరన్‌ మ్యాన్‌ సూట్‌లా ఉండే పరికరాలను ఓ  యువకుడు తయారు చేసి కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండా వాటిని రూపొందించినట్లు తెలిపాడు. ‘మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటున్నా కానీ ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నా’ అని ఆ వీడియోలో తెలిపాడు.

ఆ వీడియో కాస్తా వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా దృష్టికి చేరింది. సెప్టెంబర్‌ 20న ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంటూ ‘ఈ టోనీ స్టార్క్‌ గురించి మాట్లాడుకుందా. ఒరిజినల్‌ ఐరన్‌మ్యాన్‌. ఆ యువకుడితోపాటు అతడి తోబుట్టువుల విద్యకు చేయూతనందిస్తాం. అతడి గురించి మాకు తెలియజేస్తే దాన్ని గౌరవంగా భావిస్తాం. వీడియో ఫార్వర్డ్‌ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఆ యువకుడి వివరాలను ఆనంద్‌ మహీంద్రా బృందం తాజాగా తెలుసుకుంది. అతడు మణిపుర్‌కు చెందిన ప్రేమ్‌గా గుర్తించారు. అతడి గురించి ఆనంద్‌ మహీంద్రా ప్రస్తావిస్తూ.. ప్రేమ్‌ ఆశయం, అతడి ప్రతిభను చూసి స్ఫూర్తి పొందినట్లు పేర్కొన్నారు. మన చుట్టూ ఎన్నో వనరులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని.. కానీ ప్రేమ్‌ మాత్రం వ్యర్థాలు, చిన్న పరికాలను ఉపయోగించి అద్భుతాన్ని ఆవిష్కరించినట్లు కొనియాడారు. సూట్‌ తయారు చేసేందుకు యువకుడు గీసిన ప్లానింగ్‌, తయారైన సూట్‌కు సంబంధించి పలు ఫొటోలను పంచుకున్నారు.

తాజాగా తన సంస్థకు చెందిన బృందం ప్రేమ్‌ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను కలిసినట్లు తెలిపారు. ప్రేమ్‌ ఎదుగుదలకు సహాయపడతామని, అతడి కెరీర్‌కు మహీంద్రా గ్రూప్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ మార్గనిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అతడి తోబుట్టువుల చదువులకు కూడా చేయూతనిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు ఆనంద్‌ మహీంద్రా స్పష్టం చేశారు. అధికారులు ప్రేమ్‌ ఇంటిని సందర్శించిన పలు ఫొటోలను సైతం మహీంద్రా పంచుకున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని