Vijayawada: రామోజీరావును తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: బుద్ధప్రసాద్‌

పత్రికా రంగం అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే ‘ఈనాడు’ ముందు.. ఆ తర్వాత అని చెప్పాల్సి వస్తుందని మాజీమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Updated : 19 Jun 2024 17:15 IST

విజయవాడ: పత్రికా రంగం అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే ‘ఈనాడు’ ముందు.. ఆ తర్వాత అని చెప్పాల్సి వస్తుందని మాజీమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో పలు ప్రజాసంఘాల నేతలు, పాత్రికేయులు, ఛార్టెడ్‌ అకౌంటెంట్‌లు, న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. పత్రికారంగంలో విశేష మార్పులు తీసుకొచ్చిన మహోన్నతులు రామోజీరావు అని కొనియాడారు. 

రామోజీరావు మృతితో తెలుగుజాతి ఒక దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి చిన్న కార్యక్రమాన్ని పత్రికలో చూసే అదృష్టం కలిగించారన్నారు. ఆయన జీవితం ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథమన్నారు. పత్రికారంగం విశేష అభివృద్ధి సాధించిందంటే రామోజీరావు ఆలోచనలు, కృషి ఫలితమేనన్నారు. ఆయన సేవలను తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. అలాంటి అక్షర యోధుడి జ్ఞాపకార్థం రాజధాని అమరావతితో పాటు విజయవాడ నడిబొడ్డున కాంస్య విగ్రహం నెలకొల్పాలని, ఆ దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన ఘనత రామోజీరావుదేనని ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు అన్నారు. తెలుగు తల్లి, తెలుగుజాతి ఆణిముత్యాన్ని కోల్పోయిందన్నారు. కత్తి కంటే కలం గొప్పదని ఆయన నిరూపించారని, కలం జర్నలిస్టులదైతే సమాజాన్ని ఎంతో మార్చవచ్చని నిరూపించారన్నారు. తెలుగు జాతికి ఒక ఐకాన్‌ రామోజీరావు అని కొనియాడారు. ఆయన లేకపోవడం పాత్రికేయులకు, తెలుగు భాషాభిమానులకు ఎంతో నష్టమన్నారు. రామోజీరావు ఒక మహోన్నత వ్యక్తి, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని తెలుగుదేశం పార్టీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రశంసించారు. తెలుగు జాతికి, దేశానికి రామోజీరావు అందించిన సేవలు శ్లాఘనీయమని ప్రశంసించారు. ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీరామ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు వైవీ రావు, జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు