కొవిడ్ కట్టడి: మాస్కు, వెంటిలేషన్‌ కీలకం!

భౌతిక దూరం కంటే మాస్కులు, సరైన వెంటిలేషన్‌తో గదులు, ఇండోర్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

Published : 06 Apr 2021 19:29 IST

భౌతిక దూరం కంటే వీటి ప్రభావమే ఎక్కువ
అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని అంతర్జాతీయంగా నిపుణులు సూచిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గది వాతావరణంలో గాలి ద్వారాను వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం కంటే మాస్కులు, సరైన వెంటిలేషన్‌తో గదులు, ఇండోర్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

సరైన వెంటిలేషన్‌ లేని గదుల్లో గాలిలోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో గదులు, ఇండోర్‌ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని అంచనా వేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా నిపుణులు ఓ అధ్యయనం చేపట్టారు. పరిశోధనలో భాగంగా, ఓ క్లాస్‌ రూం మోడల్‌ను రూపొందించిన పరిశోధకులు.. అక్కడి వాతావరణంలో వైరస్‌ ప్రభావం ఎలా ఉందో కంప్యూటర్‌ విధానంలో పరీక్షించారు. ఇందుకోసం 9అడుగుల ఎత్తు, 709 చదరపు అడుగుల స్థలంలో తరగతి వాతావరణాన్ని రూపొందించి పరీక్ష జరిపారు. నాణ్యమైన మాస్కులు ధరించినట్లయితే ఆరు అడుగుల భౌతిక దూరం లేకున్నా ప్రమాదం ఏమీ లేదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా వెంటిలేషన్‌ ఉన్న, వెంటిలేషన్‌ లేని ప్రాంతాల్లో సూక్ష్మబిందువుల కదలికపై అధ్యయనాన్ని కొనసాగించారు. వెంటిలేషన్‌ లేని గదులతో పోలిస్తే..వెంటిలేషన్‌ ఉన్న గదుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం 40 నుంచి 50శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడాకు చెందిన నిపుణుడు మైఖేల్‌ కింజెల్‌ పేర్కొన్నారు.

మాస్కులు తప్పనిసరిగా ధరిస్తే పాఠశాలలు, ఇండోర్‌ గదుల్లో మూడు అడుగుల దూరం సరిపోతుందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఈ మధ్యే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజా పరిశోధన కూడా ఇదే విషయాన్ని ధ్రువపరుస్తోందని తాజా పరిశోధనలో పాల్గొన్న మైఖేల్‌ కింజెల్‌ గుర్తుచేశారు. మాస్కులు, వెంటిలేషన్‌తో వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చని.. పాఠశాలలు, కార్యాలయాల్లో భౌతిక దూరం నిబంధనను సడలించుకోవచ్చని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని