
పైత్యం పీక్స్: చుట్టు కొలతలతో పెళ్లి ప్రకటన.. వరుడిపై నెటిజన్ల ఫైర్!
ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయి మరీ తెల్లగా కాకపోయినా ఓ మాదిరిగా ఉన్నా చాలు. మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా ఉంటే మేలు. అన్నింటి కన్నా ముఖ్యంగా మా అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి.. నన్ను అర్థం చేసుకోవాలి. సాధారణంగా పెళ్లి ప్రకటనలన్నీ ఇలానే ఉంటాయి. పొడవు, రంగు, గుణగణాలు, ఉద్యోగం ఇలా సాగిపోతుంటాయి. కానీ ఓ వరుడు మాత్రం తన పైత్యాన్ని బయటపెట్టాడు. అమ్మాయి చుట్టుకొలతలతో సహా ఓ పెళ్లి ప్రకటన ఆన్లైన్లో పెట్టాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ అతడిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
బెటర్‌హాఫ్ అనే మ్యాట్రిమొనీ వెబ్సైట్లో ఇటీవల ఓ వ్యక్తి పెళ్లి ప్రకటన ఇచ్చాడు. అందులో తనకు కావాల్సిన వధువుకు ఉండాల్సిన లక్షణాలను పొందుపరిచాడు. ఇక్కడే శ్రుతిమించి ప్రవర్తించాడు. అమ్మాయి ఇంత ఎత్తుండాలి.. నడుము చుట్టు కొలత అంతుండాలి.. పాదం సైజు అంతే ఉండాలి అంటూ రాసుకుంటూ పోయాడు. 18-26 మధ్య వయసుండాలి అని పేర్కొనడంతో పాటు బ్రా సైజు కూడా ప్రస్తావించడం నెటిజన్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రెడిట్‌లో ఎవరో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదేం పెళ్లి ప్రకటన అంటూ కొందరు మండిపడ్డారు. ‘ఇతడు పెళ్లి కొడుకా.. లేడీస్ టైలరా’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిపై ఓ వ్యక్తి మ్యాట్రిమొనీకి ఫిర్యాదు చేయడంతో తమ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ వెబ్సైట్ పేర్కొంది.