Seat belt: అసౌకర్యం అనుకుంటే ప్రాణానికే ముప్పు.. కారు నడిపేవారూ జర సోచో!

కారు నడిపేవారు నిబంధనలు పాటించండి. సీటు బెల్టు ధరించడాన్ని అసౌకర్యంగా భావించొద్దు.

Updated : 07 Sep 2022 17:45 IST

కారు ఖరీదై ఉండాలి.. సీట్లు కంఫర్ట్‌గా ఉండాలి.. కానీ సీటు బెల్టు పెట్టుకోవడానికి అన్‌కంఫర్ట్‌!
మనల్ని ఎవడైనా ఓవర్‌టేక్‌ చేస్తే అంత వేగం అవసరమా అంటాం.. రోడ్లపై నిర్దేశించిన వేగాన్ని మాత్రం పాటించం!
కారులో దుర్వాసన రాకుండా పెర్‌ఫ్యూమ్‌ వాడతాం.. అదే దుర్వాసన వచ్చే మద్యాన్ని తాగుతూ డ్రైవ్‌ చేస్తాం.!
పక్కవాడు రెడ్‌ సిగ్నల్‌ దాటితే వీడికి రోడ్‌ సెన్స్‌ లేదంటాం.. అదే మనకైతే అప్పుడే రెడ్‌ సిగ్నల్‌ వేసేయాలా అనుకుంటూ విసుక్కుంటాం!!

చూడ్డానికి ఇవన్నీ చిన్న తప్పులు.. సిల్లీ కారణాల్లానే కనిపిస్తాయి. కానీ, దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వెనుక కారణాలను పరికిస్తే వాటి వెనుక ఇవే కనిపిస్తాయి. ఇటీవల జరిగిన సైరస్‌ మిస్త్రీ ఉదంతమూ ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అతి వేగం, రోడ్డును అంచనా వేయకపోవడం కారు ప్రమాదానికి ప్రధాన కారణాలైనప్పటికీ.. సీటు బెల్టు పెట్టుకోకపోవడమే సైరస్‌ మిస్త్రీ మరణానికి దారితీసింది. అదే కారులో ముందు వరుసలో కూర్చున్న ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డానికి అదే సీటు బెల్టు కారణం.

అసౌకర్యం అనుకోకూడదు..

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చూసి కెమెరాతో క్లిక్కు మనిపిస్తాడనో.. సీసీ కెమెరాలకు చిక్కుతామనో ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్‌ పెట్టుకుంటున్నారే తప్ప.. అది మన ప్రాణాల్ని కాపాడే నేస్తమని ఎవరూ గుర్తించడం లేదన్నది నిష్ఠుర సత్యం. కెమెరాల్లేని, పోలీస్‌ తనిఖీలు లేని రోడ్లపై వాహనదారులను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కారులో ప్రయాణించే వారూ అంతే. సీటు బెల్టు పెట్టుకోవడాన్ని అసౌకర్యంగానే భావిస్తున్నారు. ఎవరూ చూసే అవకాశం లేదనుకుంటే వాటిని తీసి పక్కన పడేస్తున్నారు. కానీ ప్రమాద సమయంలో ఇవి మనల్ని రక్షిస్తాయని గ్రహించే వారూ కొందరే. కారుకు ఎన్ని ఎయిర్‌ బ్యాగులున్నా సీటు బెల్టు ధరించినప్పుడే ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

వెనుక కూర్చునే వారు మినహాయింపు కాదు..

గతంతో పోలిస్తే కార్లలో సీటు బెల్టు ధరించడం గురించి అవగాహన పెరిగింది. అయితే, అది ముందు సీట్లో కూర్చున్న వాళ్లకే పరిమితమవుతోంది. వెనుక సీట్లో కూర్చునే వారికి తమకు నిబంధనలు వర్తించవని ఫీల్‌ అవుతున్నారు. 2019లో నిర్వహించిన ఓ సర్వేలో వెనుకవైపు ఉండే ప్రయాణికులను సర్వే చేయగా.. 7 శాతం మంది మాత్రమే సీటు బెల్టు ధరిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ సర్వేలో భాగంగా 10 వేల మందిని ఆరా తీయగా.. 70 శాతం మంది వెనుక వైపు ఉండే వాళ్లు సీటు బెల్టు ‘ధరించేదే లే’ అని చెప్పడం గమనార్హం. వాస్తవానికి కేంద్ర మోటార్‌ వాహన నిబంధనల్లో 138 (3) నిబంధన కింద వెనుక సీట్లలో కూర్చునేవారూ సీట్‌ బెల్టు  పెట్టుకోవాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. దురదృష్టవశాత్తూ దీని గురించి అవగాహన ఉన్న వారు అంతంత మాత్రమే. అందుకే  ముందు సీటు ప్రయాణికులతో పాటు వెనుక సీట్లకు కూడా సీట్‌ బెల్టు బీప్‌ వ్యవస్థను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తెలుసుకోండి.. పాటించండి..

  • కారుకు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నా సీటు బెల్టు ధరించడం ముఖ్యం. సీటు బెల్టు ప్రాథమిక రక్షణ వ్యవస్థయితే.. ఎయిర్‌బ్యాగ్స్‌ సెకండరీ. ఒకవేళ సీటు బెల్టు ధరించకపోతే.. ఎయిర్‌బ్యాగ్‌ ఒక్కటే మీ ప్రాణాలను కాపాడుతుందని అనుకోవద్దు.
  • కారు నడిపేటప్పుడు దృష్టంతా రోడ్డుపైనే ఉండాలి. మొబైల్‌ వాడడం, తోటి వారితో ముచ్చట్లు పెట్టడం వల్ల దృష్టి మరలి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది.
  • కార్లలో ఉండే హెడ్‌రెస్ట్స్‌ బయటకు తీసుకునేందుకు వీలుగా ఉంచుతారు. అనుకోని సంఘటన జరిగి.. డోర్లు, అద్దాలు తెరుచుకునేందుకు అవకాశం లేని సమయంలో వీటి సాయంతో అద్దాలు పగలగొట్టొచ్చు. ఈ విషయం మనలో చాలా మందికి తెలీదు.
  • మనదేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణాలకు కారణం అతి వేగమే. రహదారులపై వెళ్లాల్సిన వేగానికి సంబంధించిన బోర్డులు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా దూసుకెళ్లడమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
  • కొంతమంది తమ కార్లకు క్రాష్‌బార్లను సొంతంగా ఏర్పాటు చేయించుకుంటూ ఉంటారు. అయితే, ఇవి కారుకు రక్షణ కల్పిస్తాయి గానీ, ప్రయాణికులకు కాదని నిపుణులు చెబుతున్నారు.
  • కారుడ్రైవ్‌ చేసేటప్పుడు స్టీరింగ్‌కు, శరీరానికి కనీసం 300 మిల్లీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచించారు.
  • మద్యం తాగి వాహనం నడపడం నేరమే కాదు.. ప్రమాదం కూడా. సిగ్నల్‌ జంప్‌ విషయంలోనూ  అంతే. రెడ్‌ సిగ్నల్‌ దాటారంటే వేరెవరికో ముప్పు తెస్తున్నట్లే అర్థం. కాబట్టి వాహనం నడిపేవారూ నిబంధనలు పాటించండి..

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని