Medaram 2022: జనం నుంచి వనంలోకి సమ్మక్క-సారలమ్మ

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమాప్తమైంది....

Updated : 19 Feb 2022 21:10 IST

ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమాప్తమైంది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నెపల్లికి సారలమ్మ తల్లి, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు, ఏటూరు నాగారం కొండాయికి గోవిందరాజులు చేరుకోనున్నారు. వనదేవతల వనప్రవేశం వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. నలుగురూ గద్దెలపై ఆశీనులవడంతో శుక్రవారం వనదేవతల నిండు జాతరకు జనం పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం మహాజారతకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్లను దర్శించుకొని బంగారం సమర్పించారు. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. జంపన్నవాగు తీరమంతా భక్త ప్రవాహమైంది. ఇప్పటివరకు 1.30 కోట్లకుపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని