Polavaram: బ్యాక్‌ వాటర్‌పై కీలక సమావేశం.. తెలంగాణ వాదనను తోసిపుచ్చిన కేంద్ర జల్‌శక్తిశాఖ

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్రం నిర్వహించిన వర్చువల్‌

Published : 29 Sep 2022 17:36 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్రం నిర్వహించిన వర్చువల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలవరం బ్యాక్‌ వ్యాటర్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేయించామని కేంద్రం వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై 3 రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని స్పష్టం చేసింది. 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక 3 రాష్ట్రాల్లో మూడో వంతు కూడా ముంపు ప్రభావం ఉండదని తెలిపింది.

ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనప్పటికీ ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని జలశక్తి శాఖ సమావేశంలో వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై మరోసారి సర్వే చేయించాలని తెలంగాణ అధికారులు చేసిన వాదనను జలశక్తి శాఖ తోసిపుచ్చింది. 36 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా స్పిల్‌వే కట్టాలని గోదావరి ట్రైబ్యునల్‌ సిఫార్సు చేసిందని, ప్రస్తుతం 50లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని పేర్కొంది. బ్యాక్‌ వాటర్‌ సర్వేకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించేందుకు అక్టోబరు 7న నాలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో మరోమారు భేటీ కావాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని