లేడీ కానిస్టేబుల్ యూనిఫాం కొలతలకు జెంట్స్‌ టైలర్‌.. నెల్లూరు పోలీసుల తీరుపై విమర్శలు

నెల్లూరు పట్టణంలో మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది.

Updated : 08 Feb 2022 05:37 IST

నెల్లూరు: నెల్లూరు పట్టణంలో మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది. పట్టణంలోని ఉమేశ్‌చంద్ర హాలులో సోమవారం సచివాలయ మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కోసం జెంట్స్‌ టైలర్‌తో కొలతలు తీయించారు. అక్కడే కొందరు మహిళా పోలీసులు ఉన్నా, వారితో కొలతలు తీయించకుండా జెంట్స్‌ టైలర్‌ కొలతలు తీసుకోవడంతో మహిళా కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతూనే కొలతలు ఇచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా... ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మహిళలకు పురుష టైలర్‌తో కొలతలు తీయించడమేంటి? మీ ఇంట్లో ఆడవాళ్లకైతే ఇలాగే కొలతలు తీయిస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నెల్లూరు పోలీస్‌గ్రౌండ్‌లో మహిళా పోలీసు యూనిఫాం కొలతలు తీసేందుకు పురుషులను వినియోగించటం దేనికి సంకేతం. జిల్లా ఎస్పీ కూడా దీనిని సమర్థిస్తూ మాట్లాడటం బాగోలేదు. పరిశీలనకు వెళ్లిన యువజన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  సాక్షాత్తూ రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదీ? మహిళా పోలీసుల పట్ల నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల వైఖరిని తప్పుబడుతున్నాం’’ అని మండిపడ్డారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..?

మరోవైపు మహిళా పోలీస్‌లకు సంబంధించి యూనిఫాం బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు అప్పజెప్పామని ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దామని ఎస్పీ విజయారావు వివరణ ఇచ్చారు. ఈ ప్రక్రియకు ఏఎస్పీ వెంకటరత్నమ్మ ఇన్‌ఛార్జిగా ఉన్నారని, మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించామని తెలిపారు. మహిళా కానిస్టేబుళ్ల నుంచి కొలతలు తీసుకొనే కార్యక్రమానికి ఇన్‌ఛార్జిగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌పై ఎస్పీ విజయరావు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఎస్పీ సమక్షంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఆధ్వర్యంలో మహిళా ఎస్సై, మహిళా టైలర్‌, సిబ్బంది ద్వారా క్లా్త్స్‌ మెజర్‌మెంట్స్‌ తీసుకున్నట్టు తెలిపింది. అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫొటోలు తీసిన గుర్తు తెలియని వ్యక్తిపైనా చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించి  అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా టైలర్లనే నియమించాలని ఆదేశాలు ఇచ్చారని పోలీస్‌ శాఖ తెలిపింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసుల మెజర్‌మెంట్స్‌ ఎవరికీ అసౌకర్యం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ.. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని