Mercedes Benz: ఆటో ఎక్కిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సీఈవో.. పోస్ట్‌ వైరల్‌

విలాసవంత కార్ల సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా(Mercedes Benz India) సీఈవోకు పుణె(Pune)లో ఒక కొత్త అనుభవం ఎదురైంది! ట్రాఫిక్‌ సమస్య(Traffic Jam) కారణంగా ఆయన తన బెంజ్‌ కారు దిగి...

Published : 01 Oct 2022 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా(Mercedes Benz India) సీఈవోకు పుణె(Pune)లో  కొత్త అనుభవం ఎదురైంది! ట్రాఫిక్‌ సమస్య(Traffic Jam) కారణంగా ఆయన తన బెంజ్‌ కారు దిగి, సాధారణ ప్రయాణికుడిలా ఓ ఆటోలో గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే, అంతకుముందు ఆయన పుణె రోడ్లపై కొన్ని కిలోమీటర్లు నడవడం గమనార్హం. ఆటోలో ప్రయాణిస్తున్నప్పటి ఓ ఫొటోను ఆయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

‘మెర్సిడెస్‌ బెంజ్‌’ ఇండియా సీఈవో మార్టిన్‌ ష్వెంక్‌ గురువారం రాత్రి పుణెలో తన ఎస్‌-క్లాస్‌ కారులో ప్రయాణిస్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఎంతకూ ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోవడంతో చేసేదేమీ లేక రోడ్డుపై నడక మొదలుపెట్టారు. ఇలా కొన్ని కిలోమీటర్లు నడిచి.. ఓ ఆటో పట్టుకుని, గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇదంతా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వివరించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మీ ఎస్‌-క్లాస్‌ బెంజ్‌ కారు పుణె రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినప్పుడు ఏం చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా?’ అని క్యాప్షన్‌ పెట్టారు.

ఇది అభినందించదగ్గ విషయమంటూ ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన సమయంలో ప్రజారవాణా వ్యవస్థ ఏ విధంగా ఆదుకుంటుందో పలువురు వివరించారు. ఆటో డ్రైవర్‌.. మీటర్‌ ప్రకారమే ఛార్జ్‌ చేశాడు కదా? అని ఒకరు కామెంట్‌ పెట్టారు. ఇది చూస్తుంటే.. ‘గజిని’ సినిమాలో తన ప్రియురాలిని చూసేందుకు ఆమిర్‌ ఖాన్‌ ఆటోలో ప్రయాణించే సీన్‌ గుర్తొస్తుందంటూ ఒకరు స్పందించారు. పరిస్థితులకు తగినట్లు ఎలా నడచుకోవాలో నేర్పారంటూ ఒకరు కామెంట్‌ పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని