HYD Metro: ఎయిర్‌పోర్టుకు మెట్రో.. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ దాటడం సవాలే: ఎన్వీఎస్‌ రెడ్డి

రాయదుర్గం స్టేషన్‌ - నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వరకు మెట్రో నిర్మాణం అతి క్లిష్టమైనదని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో అన్నీ అడ్డంకులు దాటుకొని మెట్రో నిర్మించేందుకు అత్యుత్తమ ఇంజినీరింగ్ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నామని వివరించారు.

Updated : 18 Feb 2023 16:28 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) వరకు మెట్రో (Hyderabad Metro) నిర్మాణంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే పలు మార్లు ఈ మార్గాన్ని పరిశీలించిన అధికారులు మరోసారి రూట్‌మ్యాప్‌ పరిశీలన చేపట్టారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి (Metro MD NVS Reddy), రైల్వే బోర్డు సభ్యులు, సంబంధితశాఖల ఉన్నతాధికారులు శనివారం ప్రత్యక్షంగా రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. ప్రధానంగా రాయదుర్గం మెట్రో స్టేషన్‌(Raidurg Metro Station) నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వరకు మెట్రో నిర్మాణానికి అతిక్లిష్టమైన ప్రాంతంగా ఉంది. ఈ మార్గంలో మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వద్ద అండర్‌పాస్‌, మధ్యలో రోటరీ, పైన ఫ్లైఓవర్‌ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. ఈ ప్రాంతంలో మెట్రో నిర్మాణం ఏవిధంగా చేపట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై స్థానిక ఇంజినీర్లకు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాయదుర్గం స్టేషన్‌ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వరకు మెట్రో నిర్మాణం చాలా క్లిష్టతరమైంది. 21 మీటర్ల ఎత్తులో మైండోస్పేస్‌ జంక్షన్‌ దాటడం సవాలుతో కూడుకుంది. అండర్‌పాస్‌, మధ్యలో రోటరీ, ఫ్లైఓవర్ ఉన్నాయి. ఈ మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్‌ను అక్కడికక్కడే నిర్మించే విధంగా పరిశీలిస్తున్నాం. ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లను ఫ్లైఓవర్‌ పిల్లర్లకు దూరంగా నిర్మించాల్సి ఉంది. అత్యుత్తమ ఇంజినీరింగ్‌ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొని పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ మార్గంలో తనిఖీలు చేశాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని