Published : 24 Jul 2020 18:15 IST

బంగారం పాతిపెట్టి.. కనుక్కోమంటున్నాడు

మిచిగాన్‌ వ్యాపారి వినూత్న ఆలోచన

కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరించి అల్లకల్లోలం సృష్టిస్తోంది. గత నాలుగు నెలలుగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో అన్ని దేశాల్లో వ్యాపారులు ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది తమ వ్యాపారాలు పక్కనపెట్టి కష్టకాలంలో మరో ఉపాధి వెతుక్కుంటున్నారు. కానీ మిచిగాన్‌కు చెందిన ఓ బంగారం వ్యాపారి మాత్రం ఈ కరోనా భయాలు, కష్టాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వినూత్న కార్యక్రమం ప్రారంభించాడు. తన దుకాణంలో ఉన్న బంగారాన్ని పలు చోట్ల దాచిపెట్టి.. ప్రజలను కనిపెట్టమని సవాల్‌ విసురుతున్నాడు. ఎవరు బంగారాన్ని కనిపెడితే వారే సొంతం చేసుకోవచ్చని చెబుతున్నాడు. 

మిచ్‌గాన్‌లో ఉండే జానీ పెర్రీ.. తనకు వారసత్వంగా వచ్చిన బంగారం వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. కానీ కరోనా వల్ల అతడి వ్యాపారం ఆగిపోయింది. దుకాణం తెరిచినా ఇప్పుడప్పుడే తన వ్యాపారం సాఫీగా సాగదని గ్రహించాడు. దీంతో తన వద్ద ఉన్న దాదాపు రూ.8 కోట్లు విలువ చేసే బంగారంతో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఆర్టికల్‌లో నిధి అన్వేషణ గురించి చదివి అలాంటి ఓ కార్యక్రమం నిర్వహించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా బంగారం మొత్తాన్ని డెట్రాయిడ్‌ మెట్రోపాలిటన్‌ నుంచి అప్పర్‌ పెనిన్సులా వరకు పలు చోట్ల దాచి పెట్టాడు. ప్రజలు ఆ బంగారాన్ని కనిపెట్టి సొంతం చేసుకోవచ్చని ప్రకటించాడు. బంగారం వద్దనుకుంటే బంగారం ఎంత విలువ చేస్తుందో అంతా డబ్బు చెల్లిస్తాడట. ‘జానీస్‌ ట్రెజర్‌ క్వెస్ట్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం టికెట్‌ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో దాచిపెట్టిన బంగారం కోసం ప్రత్యేక తేదీల్లో టికెట్లను అమ్ముతారు. పాల్గొనాలనుకునే వారు జానీస్‌ ట్రెజర్‌ క్వెస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి.. టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో టికెట్‌ 49 డాలర్లు ఉంటుందట. టికెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రమే బంగారం దాచిపెట్టిన ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇస్తారు. 

ఈ ఆధారాలను ఇతరులతో పంచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ పంచుకున్నట్లు తెలిస్తే.. వారిని అనర్హులుగా ప్రకటించడంతోపాటు మరోసారి నిర్వహించే క్వెస్ట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వరు. నిబంధనలు మీరి బంగారం తీసుకోవాలని చూస్తే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జానీ పెర్రీ తెలిపాడు. దాచిపెట్టిన బంగారానికి జానీ పెర్రీ జీపీఎస్‌ ట్రాకర్‌ను అమర్చాడు. దీని ద్వారా బంగారం ఎవరికైనా దొరికిందా.. లేదా ఎత్తుకెళ్లారా అనే విషయం తెలుస్తుంది. తొలి క్వెస్ట్‌ ఆగస్టు 15న ప్రారంభం కానుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌ 13న మరో క్వెస్ట్‌ ఉంటుందని జానీ చెప్పాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని