తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక

హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించారు. ఈమేరకు సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సహా ఉన్నతాధికారులతో ..

Updated : 14 Nov 2020 16:21 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించారు. ఈమేరకు సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక అందిస్తున్నట్టు ప్రకటించారు. 

2020-21 సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే గృహ యజమానులకు 50 శాతం రాయితీ, రాష్ట్రంలోని మిగిలిన పట్టణాల్లో రూ.10వేల వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాది చెల్లించాల్సిన మొత్తంలో మినహాయింపు ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలోని 31.40లక్షల కుటుంబాలకు రూ.326.48 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదసాయం కింద 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద సాయం అందని వారు మీ-సేవాలో పేర్లు, ఇంటి, ఆధార్‌ నంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయం అందిస్తారని వివరించారు. బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే నేరుగా సాయం జమచేస్తామన్నారు. అవసరమైతే మరో రూ.100 కోట్లు సాయం అందించేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడబోదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. దసరా, దీపావళి వేళ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారని వెల్లడించారు. కొవిడ్‌పై పోరాటంలో ముందు నిలిచిన యోధులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ చెప్పారని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. కరోనా వల్ల ప్రభుత్వాలు, ప్రజల ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని