Telangana News: పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠిన చర్యలు: గంగుల కమలాకర్‌

తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పక్రియ మొదలు పెట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ పౌరసరఫరాల భవన్‌లో

Published : 17 Apr 2022 02:03 IST

హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పక్రియ మొదలు పెట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ పౌరసరఫరాల భవన్‌లో ఎఫ్‌సీఐ తెలంగాణ ప్రాంతీయ జనరల్ మేనేజర్ దీపక్‌ శర్మతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పటు, మౌలిక సదుపాయాలు, ఇబ్బందులు, ఇతర అంశాలపై సమీక్షించారు. యాసంగి ధాన్యం సేకరణ వివరాలు ఎఫ్‌సీఐ జీఎంకు మంత్రి వివరించారు.

‘‘తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అదనపు భారం భరించి ధాన్యాన్ని సేకరిస్తున్నాం. కస్టం మిల్లింగ్ సమయంలో అనవసర కొర్రీలు పెట్టి ఇబ్బందులు సృష్టించవద్దు. నాణ్యతా ప్రమాణాల మేరకు ముడి బియ్యం అందిస్తాం. ఇందుకోసం కేంద్రం, ఎఫ్‌సీఐకి లేఖలు అందజేశాం. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బ్రోకెన్ రైస్‌ శాతం అధికంగా ఉన్న ధాన్యంపై అభ్యంతరాలు లేకుండా తీసుకోవాలి. వేగంగా అందించేలా ర్యాకులు, అదనపు నిల్వ సామర్థ్యం కల్పించండి. సీఎంఆర్ గడువులో తక్కువ ధాన్యం సేకరించే రాష్ట్రాలకు, అధికంగా సేకరించే తెలంగాణకు ఒకే గడువు ఇస్తున్న అసమగ్ర విధానంపై పున:సమీక్షించాలి’’ అని గంగుల విజ్ఞప్తి చేశారు.

ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడడానికి ఎఫ్‌సీఐ డీజీఎం కమలాకర్, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడల్ అధికారులుగా నియమిస్తామని మంత్రి గంగుల తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో ఆర్థిక పరమైన అంశాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో మంత్రి చర్చించారు. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి కమలాకర్ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని