Updated : 11 May 2022 16:59 IST

Telangana News: పుకార్లు, గాలి మాటలను రైతులు నమ్మొద్దు: గంగుల కమలాకర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ధాన్యం సేకరణ సజావుగా, సంతృప్తికరంగా కొనసాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని.. పుకార్లు, గాలి మాటలను రైతులు నమ్మెద్దని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు, ఇతరత్రా సామగ్రి, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని మంత్రి విడుదల చేశారు. అసని తుపాన్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు రాకుండా, ధాన్యం తడవకుండా ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఉప కమిషనర్ రుక్మిణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల కొరత, రవాణా, తరుగు వంటి ఇబ్బందులు, అధికారుల పనితీరుపై చర్చించారు.

‘‘రూ. 3వేల కోట్ల నష్టాన్ని భరించి కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత ఉందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5 కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడాం. ఇంకా 6.35 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.  అసని తుపాన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ డీసీఎస్‌ఓలు, డీఎంలు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి.

నిన్నటివరకు 5,774 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. 28 జిల్లాల్లోని 3,760 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. 1.56 లక్షల మంది రైతుల నుంచి రూ.2,121 కోట్ల విలువైన 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించాం. యాసంగి, వానాకాలం ధాన్యం సేకరణను సీఎంఆర్ గడువులోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నాం. ఎక్కడా ఏ సమస్యలు లేకుండా చూసుకుంటున్న నేపథ్యంలో రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదు. ఎక్కడైనా.. ఎవరికైనా ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే..  800-425-00333, 1967 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలి’’ అని మంత్రి గంగుల సూచించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని