Published : 27 Jun 2022 13:11 IST

Telangana news: 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో ఉస్మానియా ఆస్పత్రిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నార్సింగిలో హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్‌ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజ్‌డ్‌ కిచెన్‌ను హరీశ్ రావు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రల్లో ఇక్కడి నుంచి రోగుల సహాయకులకు భోజనం అందించనున్నారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట... ఇలా పేరు ఏదైనా, హరేకృష్ణ ట్రస్టుతో కలిసి ప్రభుత్వం లక్షల మంది ప్రజల ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఈ 18 ఆస్పత్రులకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఒక రోగి వెంట ఒకరో ఇద్దరో సహాయకులు కూడా వస్తారు. సర్జరీలు జరిగినప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స కోసం రోగులు, వారి సహాయకులు రోజుల తరబడి వారితోనే ఉండాల్సిన పరిస్థితి. ఆస్పత్రుల్లో రోగులకు ప్రభుత్వమే ఉచితంగా పోషకాహారం అందిస్తోంది. రోగులకు తోడుగా వచ్చే సహాయకులు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు. కుటుంబసభ్యులు ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరడమే ఒక నరకమైతే.. ఆకలితో పడుకోవడం ఇంకో నరకం. ఇలా రోగుల సహాయకులు మానసికంగా, శారీరకంగా అవస్థలు పడడాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించారు.

5 రూపాయలకే కడుపు నిండా భోజనం..

సహాయకుల కోసం ఇప్పటికే నైట్ షెల్టర్లు నిర్మించి తాగునీటి వసతి కల్పించారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఒక పూట ఆకలిని తీరుస్తున్నాయి. అయినప్పటికీ వారు అర్ధాకలితో ఉంటున్నారని సీఎం కేసీఆర్ గ్రహించారు. మానవత్వంతో ఆలోచించి రోగుల సహాయకులకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్‌ సమావేశాల్లో చెప్పినట్లు అమలు చేసి చూపించారు. దీని ద్వారా 18 ఆస్పత్రుల్లో నిత్యం సుమారు 20 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఒక్కో ప్లేట్ భోజనానికి ప్రభుత్వం 21 రూపాయలు రాయితీ ఇస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ఆస్పత్రుల్లో భోజనం కోసం ప్రభుత్వం ఏటా రూ.38.66 కోట్లు ఖర్చు చేస్తోంది. భోజనం తినడానికి అవసరమైన నీటి సదుపాయం, షెల్టర్స్‌, ఫ్యాన్లు వంటివి టీఎస్‌ఎండీసీ ఏర్పాటు చేస్తోంది’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలని..

‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఉత్తమ చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డైట్‌ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీ.బి. క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు ఒక్క బెడ్‌కు కేటాయించే డైట్ ఛార్జీలను రూ.56 నుంచి రూ.112కు పెంచాం. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు రూ.40 నుంచి రూ.80కి పెంచాం. దీని కోసం ప్రభుత్వం ఏటా రూ.43.50 కోట్లు వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తూ అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ వైద్య ప‌రిక‌రాల నిర్వహణ కోసం దేశంలోనే తొలిసారిగా ‘బ‌యో మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్’ పేరుతో విధానాన్ని అమలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

రోగుల‌కు ఎక్కడికక్కడ సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు..

‘‘హైద‌రాబాద్ జ‌నాభా, రాష్ట్ర జ‌నాభా ఏటా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వైద్య స‌దుపాయాల కల్పనపై గత ప్రభుత్వాలు ఏనాడూ దృష్టి సారించ‌లేదు. దీంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ న‌గ‌రం న‌లువైపులా నాలుగు టిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాల‌నే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడంతో పాటు రోగుల‌కు ఎక్కడికక్కడ సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు అందుబాటులోకి వస్తాయి. రూ. 2,679 కోట్లతో నిర్మించ‌నున్న 3 సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ శంకుస్థాప‌న చేశారు. ఒకవైపు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే.. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ప్రభుత్వం చేపడుతోంది. పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ తీసుకునే అనేక చర్యలు విజయవంతం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు, అవార్డులు వస్తున్నాయి’’ అని హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని