మునుగోడు ఉప ఎన్నిక హామీ.. 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీశ్‌ శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంజూరు చేసిన ఈ ఆస్పత్రిని రూ.36కోట్ల నిధులతో నిర్మించనున్నారు. 

Updated : 18 Apr 2023 12:50 IST

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంజూరు చేసిన ఈ ఆస్పత్రిని రూ.36కోట్ల నిధులతో నిర్మించనున్నారు. 

శంకుస్థాపన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రూ.1300కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.  ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్‌ సూచనలతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. మర్రిగూడలో 30 పడకల ఆస్పత్రి మంజూరు చేశామని.. తంగేడిపల్లి పీహెచ్‌సీకి రూ.90లక్షలు కేటాయించామని తెలిపారు. 

 కేంద్ర ప్రభుత్వం బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ప్రారంభించినా అక్కడ వసతులు లేవని.. కేవలం ఓపీ సేవలే అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్‌ సెంటర్లు ఉంటే.. ఇప్పుడు 100 ఏర్పాటు చేసుకున్నామని హరీశ్‌ తెలిపారు. కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలతో పాటు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.  

నిరుపేదల వద్దకే వైద్యం వెళ్లాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానాలను ప్రారంభించుకున్నామని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 30 శాతం మాత్రమే జరిగే ప్రసవాలు.. కేసీఆర్‌ కిట్‌తో ఇప్పుడు 68 శాతానికి పెరిగాయన్నారు. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే విద్యార్థులు ఉక్రెయిన్, ఫిలిఫ్పీన్స్‌ వెళ్లేవారని.. కానీ ఇప్పుడు 35 మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో అందుబాటులోకి రావడంతో బయటికి వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే వైద్యవిద్యను పూర్తి చేస్తున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని