Harish rao: సొంతగడ్డపై సేవలు అందించేందుకు వైద్యులు ముందుకురావాలి: హరీశ్‌రావు

విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వైద్యులు సొంతగడ్డపై సేవలందించేందుకు తిరిగిరావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. నిమ్స్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేసిన యూకే వైద్య బృందాన్ని సన్మానించిన అనంతరం ఆయన ప్రసంగించారు.

Published : 04 Mar 2023 15:57 IST

హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణలో గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా మినహా ఒక్క సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదని మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) విమర్శించారు. తెలంగాణలో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నవాటిని బలోపేతం చేస్తుందని తెలిపారు. నిమ్స్‌ ఆసుపత్రిలో (NIMS Hospital) చిన్న పిల్లల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేసిన యూకే వైద్య బృందాన్ని మంత్రి శనివారం సన్మానించారు. 100 మందిలో ఒక చిన్నారికి గుండె సమస్య ఉంటుందన్న హరీశ్‌రావు.. వీరికి శస్త్ర చికిత్స అందించలేక నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమ చిన్నారులను కోల్పోతున్నారన్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్‌లోనే తొలిసారి గుండెశస్త్ర చికిత్సలు జరిగాయన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగిన గుండె శస్త్ర చికిత్సల వైద్య శిబిరంలో 9 మంది పసి పిల్లలకు ప్రాణం పోసిన వైద్య బృందాన్ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. 3 నెలల చిన్నారికి చేసిన సర్జరీ విజయవంతమైందని వెల్లడించారు. 

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వైద్య నిపుణులు సొంతగడ్డపై సేవలు అందించేందుకు ముందుకు రావాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ రమణ నేతృత్వంలో 10 వైద్యులు, నర్సుల బందం చేసిన సేవలను కొనియాడారు. డాక్టర్ రమణను స్ఫూర్తిగా తీసుకుని అమెరికా, యూకే లాంటి దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వైద్య నిపుణులు రాష్ట్రంలో పేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకురావాలని కోరారు. వైద్య రంగంలో కొత్త విజ్ఞానం, సాంకేతికత పరిజ్ఞానం అందించాలని సూచించారు. ‘‘హైదరాబాద్‌లో నాలుగువైపుల 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. వరంగల్‌లో 2వేల పడకలతో ఏర్పాటు చేస్తున్న సూపర్‌ స్పెషాలిటీని ఈ ఏడాది దసరా పండగ వరకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వైద్య సేవలతో పాటు మెడికల్‌ విద్యార్థుల కోసం అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దాదాపు రూ.6వేల కోట్లతో సూపర్‌ స్పెషాలిటీని నిర్మిస్తున్నాం’’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని