Updated : 17 May 2022 14:19 IST

BP and Diabetes: బీపీపై సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: హరీశ్‌రావు

హైదరాబాద్‌: కొవిడ్‌ తర్వాత బీపీ బాధితులు పెరుగుతుండటంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రపంచ అధిక రక్తపోటు దినం సందర్భంగా హైదరాబాద్‌లో గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. బీపీ బాధితుల సంఖ్యపై గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌, కార్డియోలజికల్ సొసైటీ సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. బీపీ, షుగర్‌ బాధితులను గుర్తించి వైద్యం అందించేలా రాబోయే మూడు నెలల్లో వందశాతం ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

30 ఏళ్ల లోపు వారు కావడం బాధాకరం..

‘‘అకాల మరణాలకు బీపీ కారణమవుతోంది. దాన్ని కంట్రోల్‌ చేసుకోవడం అవసరం. బీపీ, షుగర్ ఉన్న వారిలో 60శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పని ఒత్తిడిలో పడిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక లైఫ్ స్టైల్ చాలా మారింది. ఆహారపు అలవాట్లు బాగా మారిపోయాయి. 30 ఏళ్ల లోపు వారూ బీపీ బాధితులు కావడం బాధాకరం. నిత్య జీవితంలో శారీరక శ్రమ అవసరం.

ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ..

ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాం. వారిలో 13 లక్షల మందిలో బీపీ ఉన్నట్టు గుర్తించాం. రానున్న మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉచితంగా ప్రజలకు మందులు ఇచ్చే లక్ష్యంతో ఎన్‌సీడీ కిట్‌ను ప్రారంభించాం. దీనికి సంబంధించి ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. మందులు సరిగా వాడుతున్నారా లేదా అని తెలుసుకుంటున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి మళ్లీ పరీక్షలు చేసి బీపీ, షుగర్ మందుల డోస్ నిర్ణయిస్తాం. భారత్‌లోనే ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ. 450 ఆయుష్ వెల్నెస్ కేంద్రాల ద్వారా యోగా ఫిట్‌నెస్‌ కార్యక్రమాలు చేపట్టనున్నాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

హైదరాబాద్‌లో బీపీ రోగుల సంఖ్య పెరగొచ్చు: సర్వే

బీపీ బాధితుల సంఖ్యపై గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌లో బీపీ రోగుల సంఖ్య పెరగవచ్చని సర్వేలో గుర్తించారు. పదివేల మందిపై సర్వే చేసి ఐదు వేల మంది సర్వే ఫలితాలు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ తర్వాత పెరుగుతున్న బీపీ కేసులపై కూడా సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం 50శాతం మంది బీపీ బారినపడే అవకాశం ఉన్నట్లు తేలింది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts