TS News: మార్చి 31 లోపు ప్రతి నియోజకవర్గంలో ‘దళితబంధు’: హరీశ్‌రావు

రాష్ట్రంలో మార్చి 31వ తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేసేలా

Updated : 23 Jan 2022 14:47 IST

సంగారెడ్డి: రాష్ట్రంలో మార్చి 31వ తేదీ లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దళితబంధు పథకంపై ఆయన సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్‌ ఖాతాలో నిధులు జమ చేసినట్లు వివరించారు.

‘‘ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలన్నది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. పథకం అమలు కోసం ఎమ్మెల్యేలు జిల్లా బాధ్య మంత్రి అధ్యక్షతన నియోజకవర్గంలోని ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేయొచ్చు. ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు ఇస్తే వారు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, బ్యాంకు అకౌంట్లు తెరవడం ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలి. మార్చి మొదటి వారం కల్లా యూనిట్లను గ్రౌండ్‌ చేయాలి. ఈ ప్రక్రియకు రెండు నెలల గడువే ఉన్నందున అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.

పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. దళిత బంధుపై రకరకాల రాజకీయ విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధును అమలు చేస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో దళితబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాం. వచ్చే ఆర్థిక ఏడాదిలో దళిత బంధును విస్తృతంగా అమలు చేస్తాం. భాజపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని హరీశ్‌రావు అన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని