KTR London Tour: ప్రపంచంతో భారత్‌ పోటీ.. విప్లవాత్మక సంస్కరణలు అవసరం: కేటీఆర్‌

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన...

Published : 20 May 2022 22:25 IST

లండన్‌: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన సమావేశంలో భారత్, బ్రిటన్‌కి చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ హైకమిషనర్ సుజిత్ జోయ్ ఘోష్, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాలపైన కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

‘‘ప్రపంచంతో పోటీపడి భారత్‌ ముందుకు పోవాలంటే అద్భుతమైన విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలు అవసరం. ప్రపంచమంతా తమ దేశ జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే, భారత దేశ జనాభాలో ఉన్న అత్యధిక యువ బలం ఆధారంగా అగ్రశ్రేణి దేశంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. పాలనా సంస్కరణలు, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇవాళ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా నిలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభిత పరిస్థితులను దాటుకొని ఈరోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఆకర్షించే ఒక అద్భుతమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ఇందుకు పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణం. కేవలం పెట్టుబడులే కాకుండా ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిది. రాష్ట్రం సాధించిన విజయాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కావు.. అవి భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముంది. ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు దేశం విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలి’’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని