HYderabad: మెట్రో విస్తరణపై కేంద్రానికి ఎందుకీ వివక్ష?: మంత్రి కేటీఆర్‌

బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌, నాగోలు నుంచి ఎల్బీనగర్‌ వరకు 31 కి.మీ మేర మెట్రో విస్తరణకు సహకరించాలని కోరితే.. ఆ ప్రాంతాల్లో సాధ్యం కాదని కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Updated : 28 Mar 2023 20:18 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరితే.. ప్రయాణికుల రద్దీలేదు, సాధ్యం కాదంటూ కేంద్రం తప్పుడు నివేదికలు ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆక్షేపించారు. హైదరాబాద్‌ విస్తీర్ణంతో ఏ మాత్రం సరిపోని నగరాలకు నిధులిస్తూ హైదరాబాద్‌కి ఇవ్వలేమనడం వివక్షకాదా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమేనని సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో 50 చెరువుల పునరుజ్జీవనం, సుందరీకరణకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌, నాగోలు నుంచి ఎల్బీనగర్‌ వరకు 31 కి.మీ మేర మెట్రో విస్తరణకు సహకరించాలని కోరితే.. ఆ ప్రాంతాల్లో అంత సాధ్యం కాదని కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని అన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌లో 10 నగరాల్లో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. ప్రతి నగరంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. నిధులు ఇచ్చే ఉద్దేశం లేకపోతే లేదని చెబితే సరిపోతుంది. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదా? దేశ సంపదలో హైదరాబాద్‌ సంపద ఉపయోగపడట్లేదా? తెలంగాణ నుంచి మనం పన్నులు కట్టడం లేదా? హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది’’ అని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా మెట్రోను విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని