KTR: దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకోపార్క్‌ ఏర్పాటు చేయబోతున్నాం: మంత్రి కేటీఆర్‌

దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. నీటిలో నడిచే అనుభూతి ఉండేలా హిమాయత్‌ సాగర్‌పై ఏర్పాటు చేస్తామని  తెలిపారు.

Published : 12 Oct 2022 01:10 IST

హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. అతి పెద్ద పక్షుల ప్లేస్‌ కూడా ఆ పార్క్‌లో వస్తుందన్నారు. నీటిలో నడిచే అనుభూతి ఉండేలా హిమాయత్‌ సాగర్‌పై ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల్లో రూ.75 కోట్లతో  ఏర్పాటు చేయనున్న పార్క్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.

సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో 2050 వరకు ఈ జలాశయాల అవసరం లేకుండానే మంచినీటిని అందించేలా కృష్ణా, గోదావరి నీరు తెప్పిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ 84 గ్రామాల్లో 111 జీవో ఎత్తివేశారని, ఆక్రమణల తొలగింపును ఎవరూ అడ్డుకోవద్దన్నారు. జంట జలాశయాలకు నీరు తెచ్చే బుల్కాపూర్‌ నాలా, ఫిరంగి నాలా మీద ఉన్న కబ్జాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గండిపేట వద్ద ఉద్యానవనం ప్రారంభం

నగరంలో జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చెరువులు కాలుష్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ గండిపేట వద్ద నిర్మించిన ఉద్యానవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ 5.5 ఎకరాల్లో రూ.35.60కోట్లతో ఈ ల్యాండ్‌ స్కేప్‌ను నిర్మించింది. ఈ పార్క్‌లో ఫ్లవర్‌ టెర్రాస్‌, పిక్నిక్‌ స్పాట్స్‌, 1200 కెపాసిటీలో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, పార్క్‌లో కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులు అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని