Telangana News: హైదరాబాద్‌లో ఏరోస్పేస్ యూనివర్సిటీ

రాష్ట్రంలో మరిన్ని ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పార్కులతో పాటు పరిశ్రమ వర్గాలతో కలిసి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు మంత్రి

Updated : 07 Jul 2022 15:27 IST

ప్రయత్నాల్లో ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరిన్ని ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పార్కులతో పాటు పరిశ్రమ వర్గాలతో కలిసి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లను తయారు చేసే ‘శాఫ్రాన్‌’ సంస్థకు చెందిన ఏరోస్పేస్‌ ఫ్యాక్టరీని శంషాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శాఫ్రాన్ గ్రూప్‌ ఆధ్వర్యంలో మూడో అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్న ఆయన.. హైదరాబాద్ దేశంలో ఉత్తమ ఏరోస్పేస్ వ్యాలీగా మారుతోందని చెప్పారు.

నాలుగేళ్ల నిరంతర శ్రమ..

ఇతర ప్రపంచస్థాయి ఏరోస్పేస్ సంస్థలు కూడా హైదరాబాద్‌కు వస్తాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ వ్యక్తం చేశారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెంటర్ రూపంలో శాఫ్రాన్ నుంచి నాలుగో పెట్టుబడి కూడా రానుందని చెప్పారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ రూపంలో అద్భుత విధానంతో పాటు మెగా ప్రాజెక్టులకు చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్, దిల్లీ, ప్యారిస్‌లో 35 సమావేశాలు.. 400కు పైగా మెయిల్స్, నాలుగేళ్ల నిరంతర శ్రమ కారణంగానే శాఫ్రాన్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. 

హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌, ఏవియేషన్ ఎకోసిస్టం రోజురోజుకూ వృద్ధి చెందుతోందన్న కేటీఆర్‌.. కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి నిరంతరం అవార్డులు పొందుతోందని తెలిపారు. జీఎంఆర్ చేపట్టిన టెర్మినల్ విస్తరణ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్‌కు అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్ కూడా అవసరం అవుతాయని కేటీఆర్‌ అంచనా వేశారు. హైదరాబాద్ నుంచి యూరోప్, యూఎస్‌కు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్‌ నడుపుతామన్న హమీ నెరవేర్చాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కేటీఆర్ కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని