KTR: నిందితుడు సైఫ్‌ అయినా.. సంజయ్‌ అయినా వదలం: ప్రీతి మృతిపై స్పందించిన కేటీఆర్‌

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. నిందితులు ఎవరైనా.. ఎంతటివారైనా వదిలేది లేదని తేల్చి చెప్పారు.

Updated : 27 Feb 2023 19:16 IST

హనుమకొండ: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రీతి మృతిపై స్పందిస్తూ.. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులు ఎవరైనా.. ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. నిందితుడు సైఫ్‌ అయినా.. సంజయ్‌ అయినా వదిలిపెట్టమని కేటీఆర్‌ తేల్చి చెప్పారు.

నిమ్స్‌లో అయిదు రోజులు మృత్యువుతో పోరాడిన వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె.. ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని స్వగ్రామం గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు. కాగా, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని, రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని