KTR: యువత ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్లాలి: కేటీఆర్‌

సమాజంలో అన్ని వర్గాల ప్రజలు... ప్రత్యేకంగా యువతలో దయ, కరుణ గురించి మహాత్మాగాంధీ చెప్పారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును కేటీఆర్‌...

Published : 12 Aug 2022 13:25 IST

హైదరాబాద్: సమాజంలో అన్ని వర్గాల ప్రజలు... ప్రత్యేకంగా యువతలో దయ, కరుణ గురించి మహాత్మాగాంధీ చెప్పారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును కేటీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. మూడు రోజులపాటు జరగనున్న సదస్సుకు రామచంద్ర మిషన్ గ్లోబల్ గురు కమలేశ్‌ డి. పటేల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ డా. అనంత దురైయప్ప, ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్, గాయకురాలు ఖతీజా రెహమాన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. పలు దేశాలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యవత, విద్యార్థులు సదస్సుకు తరలిచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో రామచంద్ర మిషన్, కన్హా శాంతి వనం నేతృత్వంలో సేవలు చేయడాన్ని కొనియాడారు. కన్హా శాంతి వనం సేవలు తెలంగాణకు చాలా అవసరమని.. యువతలో నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నందుకు కేటీఆర్ అభినందించారు.

సదస్సులో భాగంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పిస్తున్నాం. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనకు హైదరాబాద్ పెట్టింది పేరు. నేటి సాంకేతిక రంగంలో తెలంగాణ దూసుకుపోవడమే కాకుండా 8 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయ రంగంలో తెలంగాణ విప్లవాత్మక పురోగతి సాధించింది. తెలంగాణలో సెల్ఫ్ ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ విధానం అమల్లోకి తీసుకొచ్చి యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నాం. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో యువత ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లాలి. ధ్యానంతో దయ, కరుణ అలవరుచుకోవడం ద్వారా నిర్ధేశించుకున్న గొప్ప లక్ష్యాలు చేరుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని కేటీఆర్ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని