Nadendla: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర: మంత్రి నాదెండ్ల

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 11 Jul 2024 15:49 IST

అమరావతి: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్‌ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు. ధరల స్థిరీకరణపై రిటైల్‌ వర్తకులతో మంత్రి సమీక్షించారు.

రాయితీపై నిత్యావసర సరకులు..

నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభించింది. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పౌరసరఫరాలశాఖ, కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరకులను రాయితీపై అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా  ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హోల్ సేల్‌ దుకాణదారులు, రిటైల్‌ వర్తకులు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలనూ రైతు బజార్ల ద్వారా  రాయితీపై పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని