Andhra News: విద్యుత్‌ వినియోగం తెలుసుకొనేందుకే మీటర్ల ఏర్పాటు: మంత్రి పెద్దిరెడ్డి

విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు వేగవంతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులను ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో

Published : 18 May 2022 01:38 IST

అమరావతి: విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు వేగవంతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులను ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్‌ విభాగం అప్రమత్తంగా ఉంటేనే విద్యుత్ చౌర్యం, దుర్వినియోగం, నష్టాలను నియంత్రించగలమని మంత్రి పేర్కొన్నారు. అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, అనుమతి లేకుండా అధిక లోడ్‌ను వినియోగించుకోవడం, మీటర్ల ట్యాంపరింగ్ తదితర అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలన్నారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపైనా అధికారులు దృష్టి సారించాలని.. తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలు మరింతగా తగ్గాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.

వ్యవసాయ విద్యుత్ స్మార్ట్ మీటర్లపై రైతులను తెదేపా తప్పుదోవ పట్టిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామో తెలుసుకునేందుకే మీటర్లు బిగింపు జరుగుతోందన్నారు. మరోవైపు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5,31,140 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేసినట్టు విద్యుత్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. అక్రమాలకు పాల్పడిన కేసులకు సంబంధించి రూ.131.90 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు మంత్రికి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని