
Ap News: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసభ్యంగా మాట్లాడితే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా?: పేర్ని నాని
అమరావతి: కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. కరోనా మరణాలు మరింత తగ్గేలా చూడాలని శాఖాధిపతులను కోరినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే మెరుగైన స్థితిలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణ మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పారు.
ఉద్యోగుల సమ్మె విషయం మా దృష్టికి రాలేదు..
ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ అంశం ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అనంతరం ఉద్యోగుల సమ్మెపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు. ఉద్యోగులతో మాట్లాడేందుకు సీఎస్, ప్రభుత్వ సలహాదారు, ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే ఉద్యోగులు రోడ్డెక్కవద్దనే ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు. బాధలో ఉన్న ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ వేసి ఉండొచ్చని వ్యాఖ్యనించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసభ్యంగా మాట్లాడితే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా?అని ప్రశ్నించారు. ఏదైనా న్యాయంగా పోరాటం చేస్తేనే సాధించగలుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నానా తిట్లు తిడుతూ.. రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేబినెట్ నిర్ణయాలు..
* ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన రూ.580 కోట్లకు ఆమోదం.
* రాష్ట్రంలో 16 వైద్య కళాశాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. వాటి కోసం రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* ఇప్పటివకే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం. వాటి అభివృద్ధికి రూ. 3,820 కోట్లు వ్యయానికి కేబినెట్ ఆమోదం.
* ఉద్యోగుల పదవీ విరణమ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం.
* కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం.
* జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో ఉద్యోగులకు 10 శాతం, పింఛన్‌దారులకు 5 శాతం రిజర్వేషన్‌కు ఆమోదం.
* ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం ప్రారంభం.
* కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌ను మరొకరికి అప్పగించే నిర్ణయానికి ఆమోదం. నిర్వహణ ఖర్చు తగ్గించుకొనేందుకు బిడ్ ద్వారా 28 ఏళ్లపాటు అప్పగించేందుకు ఆమోదం లభించింది.
* అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
* కొవిడ్ కోసం తాత్కాలిక నియామకాలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖకు కేబినెట్ ఆదేశం.
* ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములను గ్రోత్ పాలసీ కింద వినియోగానికి కేబినెట్ ఆమోదం.
* తిరుపతిలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు 5 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం.
* తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా దేవాదాయ చట్ట సవరణకు అంగీకారం.
* ఐసీడీఎస్‌లో బాలామృతం, పాల సరఫరాను ఆమూల్‌కు అప్పగిస్తూ నిర్ణయం.
* జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులు. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేలా వెసులుబాటుకు ఆమోదం.
* రూ.5వేల కోట్లు రుణాల సేకరణకు ఏపీ పౌరసరఫరాల శాఖకు వెసులుబాటు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం.