Telangana News: మహబూబ్‌నగర్‌లో ఫ్రీడం ఫర్‌ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి

Updated : 13 Aug 2022 17:46 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ వరకు ఇవాళ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీ చేపట్టింది. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నేతలు, అధికారుల ప్రసంగాల అనంతరం.. ర్యాలీ ప్రారంభించే సందర్భంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ చేతిలోని తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. మంత్రికి తుపాకి ఇచ్చిన కానిస్టేబుల్‌ ఎవరు? అందులో ఉన్నది డమ్మీ బుల్లెట్టా, ఉత్సవాల సందర్భంగా కాల్పులు జరిపే బుల్లెట్టా అనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

రబ్బర్‌ బుల్లెట్‌ పేల్చా: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గన్‌  వివాదంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వివరణ ఇచ్చారు. ‘‘ నేను పేల్చింది రబ్బర్‌ బుల్లెట్‌ గన్‌. ఫ్రీడం ఫర్‌ ర్యాలీ ప్రారంభోత్సవం కోసం జిల్లా ఎస్పీ స్వయంగా ఇచ్చిన రబ్బర్‌ బుల్లెట్‌ గన్‌తో పేల్చాను. పోలీసుల తుపాకి లాక్కొని కాలిస్తే ఊరుకుంటారా? గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవానికి రబ్బర్‌గన్‌ పేల్చా. నేను ఆలిండియా రైఫిల్‌ అసోసియేషన్ సభ్యుడిని. గన్‌కు సంబంధించిన నిబంధనలన్నీ నాకు తెలుసు’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని