
AP News: విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచనలేదు: మంత్రి సురేశ్
అమరావతి: కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా .. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే ఆలోచన ఉందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేదని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఈనెల 30 వరకు సెలవులు
కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.