Andhra Pradesh : సమ్మె నిర్ణయం ఉపసంహరణ: ఉద్యోగ సంఘాలు

మంత్రుల కమిటీతో రెండ్రోజులపాటు సుదీర్ఘంగా చర్చించామని పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ తెలిపారు. తమకు జరిగిన అన్యాయం గ్రహించి సానుకూలంగా..

Updated : 06 Feb 2022 07:54 IST

అమరావతి: మంత్రుల కమిటీతో రెండ్రోజులపాటు సుదీర్ఘంగా చర్చించామని పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ తెలిపారు. తమకు జరిగిన అన్యాయం గురించి సానుకూలంగా చర్చించామన్నారు. మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి సవివరంగా చర్చించామని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారని చెప్పారు. తమ చిన్న చిన్న మాటలను పట్టించుకోవద్దని సీఎంను కోరుతున్నామని తెలిపారు. ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి మాకు మేలు చేశారని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరిందని సూర్యనారాయణ తెలిపారు. రేపు సీఎంను కలిసి కృతజ్ఞతలు చెబుతామని వెల్లడించారు.  మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి సవివరంగా చర్చించామని తెలిపారు. సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

ఉద్యోగులపై అభిమానాన్ని సీఎం మరోసారి చాటుకున్నారని మరో నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. సచివాలయంలో పని చేసే ఉద్యోగులందరికీ 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ తర్వాత కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పడం ఆనందంగా ఉందని చెప్పారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కోరామని, ప్రభుత్వం నుంచి త్వరగా సానుకూల స్పందన రావడం సంతోషకరమని పేర్కొన్నారు. కొందరి వల్ల బాధ కలిగినందుకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. సానుకూల నిర్ణయం వచ్చింది కాబట్టి సమ్మె చేయాల్సిన అవసరం లేదన్నారు. పీఆర్సీ నివేదిక ఇస్తామని చెప్పడం సంతోషం కలిగించిందని మరో నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇస్తామన్నారు. అన్ని సమస్యలు ముగిశాయని చెప్పడం లేదని పేర్కొన్నారు. పరిష్కారంలో ఇది ఒక మంచి ఆరంభమని తెలిపారు. మొదలైన రోజే అన్నీ పూర్తి చేసుకోలేమని వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని