Kavita: దోషులను ప్రభుత్వం వదిలిపెట్టదు.. ప్రీతి కుటుంబానికి ఇదే నా హామీ: ఎమ్మెల్సీ కవిత

కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈమేరకు ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖరాశారు.

Published : 28 Feb 2023 16:12 IST

హైదరాబాద్‌: కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈమేరకు ప్రీతి తల్లిదండ్రులకు ఆమె లేఖ రాశారు. ‘‘ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నా. ఏ తల్లిదండ్రులకు రాకూడని పరిస్థితి ఇది. బాధిత కుటుంబానికి కేసీఆర్‌ ప్రభుత్వం, భారాస అండగా ఉంటుంది. విద్యార్థిని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారకులైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని హామీ ఇస్తున్నా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని కవిత లేఖలో పేర్కొన్నారు.

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి ఈ నెల 22న హానికారక ఇంజెక్షన్‌ తీసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వరంగల్ ఎంజీఎంలో, ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స అందించారు. నిమ్స్‌లో ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె 26వ తేదీ రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని