Telangana News: జర్నలిజంలో విశ్వసనీయత ముఖ్యం: ఎమ్మెల్సీ కవిత

విశ్వసనీయత కలిగిన వార్తలు రాసేవారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంచలనం..

Published : 24 Apr 2022 21:38 IST

హైదరాబాద్‌: విశ్వసనీయత కలిగిన వార్తలు రాసేవారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంచలనం సృష్టించే వార్తలు రాసేవారు కొద్దిరోజులే నిలబడతారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన ముగింపు కార్యక్రమానికి కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుందరిని ఒకచోటకు తీసుకువచ్చి శిక్షణ ఇవ్వడం శుభపరిణామమని చెప్పారు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకొనే మీడియాలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకూ పెరగడం సంతోషకరమన్నారు. 

ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలని కవిత సూచించారు. జర్నలిజంలో విశ్వసనీయత చాలా ముఖ్యమని చెప్పారు. కేసీఆర్ 2001లో ‘జై తెలంగాణ’ అనగానే ఎవరూ ఆయనను నమ్మలేదని.. కానీ తెలంగాణ వచ్చే వరకు ఆయన ‘జై తెలంగాణ’ అంటూనే ఉన్నారని గుర్తుచేశారు. విశ్వసనీయత అంటే అదేనని చెప్పారు. ఏ వార్త రాసినా సవివరంగా సమగ్రంగా రాయాలని.. అప్పుడే ఆ జర్నలిస్టుపై నమ్మకం ఉంటుందని కవిత అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని