NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్‌ తనదైన ముద్రవేశారు: మోదీ

శకపురుషుడు నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 28 May 2023 16:22 IST

దిల్లీ: శక పురుషుడు నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 101వ ‘మన్‌ కీ బాత్‌’ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని..  శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతో పాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్‌ జీవం పోశారన్నారు. 

‘‘బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో ఖ్యాతిగాంచారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ స్మరిస్తారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

వీర్‌ సావర్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. సావర్కర్‌ను ఖైదు చేసిన అండమాన్‌లోని కాలాపానీ జైలును సందర్శించిన రోజును తాను మర్చిపోలేనని చెప్పారు. నిర్భయంగా, ఆత్మగౌరవంగా వ్యవహరించే సావర్కర్‌ శైలి బానిసత్వాన్ని ఎన్నటికీ అంగీకరించదని పేర్కొన్నారు. కేవలం స్వాతంత్ర్య పోరాటమే కాదు.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావర్కర్‌ చేసిన కృషిని ఇప్పటికీ గుర్తుచేసుకొంటున్నారన్నారు.

ఏక్‌భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ స్ఫూర్తితో ప్రారంభంచిన ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన గ్యామర్‌ న్యోకుమ్‌, బిహార్‌కు చెందిన విశాఖ సింగ్‌ అనే విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. వారి పర్యటన అనుభవాలను తెలుసుకొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల సమాచారాన్ని ఒక్క చోటకు చేర్చి అందుబాటులోకి తెచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. గురుగ్రామ్‌లోని ఓ మ్యూజియంలో 8,000 రకాల కెమెరాలు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని