HCA: టికెట్ల విక్రయానికి, హెచ్‌సీఏకు సంబంధంలేదు.. అవన్నీ ఆరోపణలే: అజహరుద్దీన్‌

భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకానికి, హెచ్‌సీఏకు సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌...

Updated : 23 Sep 2022 17:10 IST

హైదరాబాద్‌: భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకానికి, హెచ్‌సీఏకు సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ అన్నారు. టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించినట్టు తెలిపారు. టికెట్ల విక్రయంలో పేటీఎం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. టికెట్లు ఆన్‌లైన్‌లోనే అమ్మామని.. బ్లాక్‌లో అమ్మలేదని చెప్పారు. హెచ్‌సీఏ టికెట్ల విక్రయంపై వస్తున్న వార్తాలన్నీ ఆరోపణలేనన్నారు. బ్లాక్‌లో అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేడియంలో మ్యాచ్‌ ఏర్పాట్లలో తామంతా బిజీగా ఉన్నట్టు చెప్పారు. మ్యాచ్‌ నిర్వహణ ఏర్పాట్లతో పాటు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్ల విక్రయ వివరాలను హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. 

‘‘టికెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదు. చాలా ఏళ్లకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం దక్కింది. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ఆసీస్‌తో మ్యాచ్‌ ఆసక్తికరంగా జరుగుతుందని భావిస్తున్నాం. పేటీఎం ద్వారా టికెట్లు విక్రయించాం. బ్లాక్‌లో టికెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మతున్నారనే వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. టికెట్ల విక్రయంపై దుష్ప్రచారం జరుగుతోంది. బ్లాక్‌లో టికెట్లు అమ్మారనే ప్రచారం అవాస్తవం. టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ ఎలాంటి తప్పూ చేయలేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో ఎలా సాధ్యం? జింఖానా మైదానంలో నిన్న జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నాం. క్షతగాత్రులకు హెచ్‌సీఏ తరఫున చికిత్స అందిస్తాం’’ అని అజహరుద్దీన్‌ అన్నారు. 

విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అజహరుద్దీన్‌ స్పందిస్తూ .. ‘‘ఎల్లుండి మ్యాచ్‌ ఎలా జరుగుతుందో చూడండి.. హెచ్‌సీఏ ఆర్థిక కార్యకలాపాలపై అనుమానం ఉంటే మా వెబ్‌సైట్‌ చూడండి. వెబ్‌సైట్‌ చూశాక అనుమానాలుంటే మమ్మల్ని అడగండి. క్రికెట్‌కు సంబంధించి మాత్రమే మాట్లాడాలని కోరుతున్నాం. టికెట్ల విక్రాయనికి సంబంధించి అన్ని వివరాలూ ఇప్పటికే చెప్పేశాం’’ అని అన్నారు. 

హెచ్‌సీఏలో విభేదాలు వాస్తవమే: విజయానంద్‌

హెచ్‌సీఏలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ అన్నారు. మ్యాచ్‌ ఘనంగా నిర్వహించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొవిడ్‌ వల్ల స్టేడియాన్ని మెయింటీనెన్స్‌ చేయలేకపోయినట్టు చెప్పారు. కుర్చీలపై కవర్లు వేస్తామని.. సౌకర్యాలను మెరుగు పరచనున్నట్టు తెలిపారు. టికెట్ల గందరగోళంపై హెచ్‌సీఏ ఓ కమిటీని వేస్తుందని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని