ఆ దేశాలను ఇంకా రాజులే పాలిస్తున్నారు
ప్రపంచం ఎంతో మారింది. అన్ని దేశాలు ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి. రాజ్యాంగాలే దేశాలను నడిపిస్తున్నాయి. ప్రజలు ఎన్నుకోబడిన నేతలతోనే పాలన సాగుతోంది. అయితే ఒకప్పటి రాజ్యాలు ఇప్పుడు లేకపోయినా రాజ కుటుంబాలు ఉన్నాయి. బ్రిటన్, భూటాన్, థాయిలాండ్
ప్రపంచం ఎంతో మారింది. అన్ని దేశాలు ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా ఉన్నాయి. రాజ్యాంగాలే దేశాలను నడిపిస్తున్నాయి. ప్రజలు ఎన్నుకునే నేతలతోనే పాలన సాగుతోంది. అయితే ఒకప్పటి రాజ్యాలు ఇప్పుడు లేకపోయినా రాజ కుటుంబాలు ఉన్నాయి. బ్రిటన్, భూటాన్, థాయిలాండ్ వంటి పలు దేశాల్లో రాజకుటుంబాలు కనిపిస్తున్నా.. వారంతా నామమాత్రంగానే దేశానికి రాజులు, మహారాణులుగా వ్యవహరిస్తున్నారు. కానీ, కొన్ని దేశాల్లో ఇప్పటికీ రాచరికం పోలేదు. సర్వాధికారాలు తమ వద్దే ఉంచుకొని దేశాలను ఏలుతున్న రాజులున్నారు. వారెవరు? ఏ దేశానికి రాజులో.. మీరే చదవండి.
సౌదీ అరేబియా
(సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ)
18వ శతాబ్దంలో అరేబియా ద్వీపకల్పంలో మహమ్మద్ బిన్ సౌద్ అనే వ్యక్తి సౌదీ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఆయన కుటుంబమే సౌదీని విస్తరించి.. సౌదీ అరేబియాగా మార్చి పరిపాలన సాగిస్తూ వస్తోంది. 2015లో తన సోదరుడు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ మృతి చెందడంతో 2015 నుంచి సౌదీ అరేబియా చక్రవర్తిగా, ప్రధాన మంత్రిగా సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ఉప ప్రధానిగా ఉన్నారు. ఈ రాజ కుటుంబం చేతులోనే శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు పనిచేస్తున్నాయి. మంత్రి మండలికి, సౌదీ అరేబియా అసెంబ్లీకి సౌదీ రాజు అబ్దుల్ అజీజ్ అధ్యక్షత వహిస్తారు. ఈ కుటుంబంలోని వ్యక్తులే ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో కీలక పదవుల్లో ఉంటారు. దాదాపు 200 మంది యువరాజులు ఈ కీలక పదవుల్లో ఉండొచ్చని అంచనా.
ఒమన్
(హైతమ్ బిన్ తారిక్)
అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయం వైపు ఉన్న ఒమన్‌ను 18వ శాతబ్దం ఉంచి అల్ బుసైదీ వంశస్థులు పాలిస్తూ వస్తున్నారు. వీరి హయాంలో ఒమన్ శక్తివంతమైన రాజ్యంగా మారింది. పోర్చుగల్, బ్రిటన్ దేశాలతో పర్షియన్ గల్ఫ్, హిందు మహా సముద్రంపై ఆదిపత్యం కోసం పోరాడింది. ఆ తర్వాత ఒమన్‌లో బుసైదీ రాజుల పాలనపై బ్రిటన్ జోక్యం ఉండేది. 1970లో కబూస్ బిన్ సైద్ రాజుగా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆ జోక్యానికి చరమగీతం పాడారు. ఆయన ఈ గత జనవరిలో కన్నుమూశారు. అనంతరం కబూస్ సోదరుడు హైతమ్ బిన్ తారిక్ చక్రవర్తిగా ఉన్నారు. ఒమన్‌లో పూర్తిగా రాచరికపు వ్యవస్థ ఉంటుంది. రాజు చెప్పిన మాటే అక్కడే శాసనమవుతుంది. సైన్యం, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ బాధ్యతలు సహా.. అన్ని అధికారాలు సుల్తాన్ వద్దే ఉంటాయి. షరియా చట్టాన్ని ఒమన్ అమలు చేస్తోంది.
బ్రూనై
(హస్సనల్ బోల్కియా)
బ్రూనై దేశాన్ని బ్రూనై దారుసలెం, నేషన్ ఆఫ్ బ్రూనై అని కూడా పిలుస్తుంటారు. అతి పెద్ద ద్వీపాల్లో ఒకటైన బోర్నియోలో ఈ దేశం ఉంది. ఈ దేశానికి హస్సనల్ బోల్కియా 29వ రాజుగా, ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒమర్ అలీ సైఫుద్దీన్ వారసుడిగా 1967లో హస్సనల్ బాధ్యతలు స్వీకరించారు. 1984లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్య పొందిన బ్రూనైలో 4.28లక్షలకుపైగా జనాభా ఉంటుందని అంచనా. ఇక్కడ అధికారాలన్నీ చక్రవర్తికే ఉంటాయి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఇస్లామిక్ రాచరికపు నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. మాలే సంస్కృతి, ఇస్లాం మతం ఈ దేశంలో కనిపిస్తాయి. ఇంగ్లిష్ కామన్ చట్టాలు, ఇస్లామిక్ చట్టాలను ఇక్కడ అమలు చేస్తారు. పార్లమెంట్ ఉన్నా.. ఎన్నికలు జరగవు.
వాటికన్ సిటీ
(పోప్)
ఇటలీలోని ఆధ్యాత్మిక నగరం వాటికన్ సిటీ స్వతంత్ర దేశంగా పరిగణించబడుతోంది. 1929లో చేసుకున్న లేటరన్ ఒప్పందం ప్రకారం ఇటలీ నుంచి స్వాతంత్ర్యం సంపాదించింది. ఇక్కడ సర్వభౌమాధికారాలు కాథలిక్ చర్చ్ హెడ్, రోమ్ బిషప్ అయిన పోప్‌కే ఉంటాయి. 121 ఎకరాల విస్తీర్ణంలో ఉండే దేశంలో 805 మంది మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో అతి చిన్న, అత్యల్ప దేశం వాటికన్ సిటీనే. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ వాటికన్‌సిటీ పోప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
స్వాజిలాండ్
(స్వాతీ - III)
ఆఫ్రికా ఖండం దక్షిణభాగంలో ఈ స్వాజిలాండ్ ఉంది. దక్షిణ ఆఫ్రికా, మొజాంబిక్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. 18వ శతాబ్దంలో గ్వానె III సారథ్యంలో స్వాజిలు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించారు. 1903 నుంచి బ్రిటీష్ పాలనలో ఉన్న ఈ దేశం 1968 సెప్టెంబర్ 6న స్వాతంత్ర్యం పొందింది. అనంతరం స్వాజిలాండ్‌ను కింగ్‌డమ్ ఆఫ్ ఎస్వటినిగా నామకరణం చేశారు. గ్వానె - III వంశస్థుల్లో ఒకడైన స్వాతీ - III.. 1986 నుంచి రాజ్య పాలన సాగిస్తున్నాడు. ఇక్కడ ఐదేళ్లకొకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ప్రభుత్వాన్ని చక్రవర్తే నడిపిస్తారు.
ఖతర్
(ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని)
ఇంకొన్ని దేశాలను రాజకుటుంబాలు, ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా పాలిస్తున్నాయి. దీనినే రాజ్యాంగబద్ధమైన రాచరికపు పాలన అని పిలుస్తుంటారు. ఖతర్‌కు రాజవంశస్థుడైన ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని ప్రస్తుతం రాజుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయనతోపాటు దేశంలో ప్రభుత్వం ఉంటుంది.
యూఏఈ
(ఖలీఫా బిన్ జాయేద్)
యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్‌కు ఖలీఫా బిన్ జాయేద్ రాజుగా, దేశాధ్యక్షుడిగా ఉన్నారు. యూఏఈలో అబుదాబి, అజ్మాన్, ఫుజైరా, షార్జా, దుబాయి, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ కువైన్ అనే ఏడు ప్రాంతాలున్నాయి. ఒక్కో ప్రాంతాన్ని షేక్‌లు పరిపాలిస్తుంటారు. వీరిందరితో ఫెడరల్ సుప్రీం కౌన్సెల్ ఏర్పాటైంది. దీని ద్వారానే యూఏఈ పాలన జరుగుతుంటుంది. అబుదాబి షేక్‌లు అధ్యక్ష, దుబాయి షేక్‌లు ప్రధాని బాధ్యతలు తీసుకుంటారు. ఈ దేశంలో ప్రత్యేక న్యాయ వ్యవస్థ ఉంది.
బహ్రెయిన్
(షేక్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా)
మరో దేశం బహ్రెయిన్‌కు షేక్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా చక్రవర్తిగా ఉన్నారు. ఈ దేశంలో ప్రభుత్వం ఉంటుంది. అయితే ప్రధాని మంత్రి నుంచి ఎంపీల వరకు అందరినీ రాజే నియమిస్తారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతున్నా.. ప్రధాని మంత్రిగా చక్రవర్తి, ప్రభుత్వంలోని కీలక పదవుల్లో అల్ ఖలీఫా కుటుంబసభ్యులే ఉంటారు.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High court: జూనియర్ లెక్చరర్ పరీక్షపై టీఎస్పీఎస్సీ నిర్ణయం సరికాదు: హైకోర్టు
-
World News
Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు
-
Politics News
Rahul Gandhi:యువతకు 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹3వేలు నిరుద్యోగ భృతి: రాహుల్ హామీ
-
Sports News
IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
-
India News
Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్.. నేడు శాన్ఫ్రాన్సిస్కో
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు