Monkey pox: మంకీపాక్స్‌ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

మంకీపాక్స్‌ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయి. ఇది స్మాల్‌పాక్స్‌లాగే తగ్గుతుందని చెప్పినా కొందరికి ప్రమాదకరంగా మారుతుందనే వాదన కూడా వస్తోంది. జ్వరం వచ్చి చర్మంపై నీటి బుడగలు వస్తే పాక్స్‌గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.

Published : 14 Aug 2022 02:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంకీపాక్స్‌ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయి. ఇది స్మాల్‌పాక్స్‌లాగే తగ్గుతుందని చెప్పినా కొందరికి ప్రమాదకరంగా మారుతుందనే వాదన కూడా వస్తోంది. జ్వరం వచ్చి చర్మంపై నీటి బుడగలు వస్తే పాక్స్‌గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాక్స్‌ల్లో ఇదే తరహా సమస్య ఉన్నా కోతుల నుంచి వచ్చిన మంకీపాక్స్‌ మనుషుల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ శంకరప్రసాద్‌ వివరించారు.

లక్షణాలు ఇవీ: జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వస్తాయి. చేతులు, పాదాల్లో దురద, పొక్కులు వస్తాయి. కళ్లు, నోరు, మల,మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, ఆరు అడుగుల దగ్గరగా ఉంటే గాలితో కూడా  వస్తుంది. 

ప్రాణాలు తీస్తుందా..?: ఒకరికి మంకీపాక్స్‌ వస్తే ఊరంత వస్తుందని చెప్పలేం. మశూచిలాగా తొందరగా వ్యాపించదు. చిన్న పిల్లలు, గర్భిణులు, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నవారికి, బ్లడ్ క్యాన్సర్‌, ఇతర క్యాన్సర్‌ రోగులు, గుండె జబ్బులకు మందులు వాడే వారికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వంద మందిలో ముగ్గురికి ప్రాణాంతకంగా మారుతుంది. పొక్కుల్లో ఉండే నీటితోగానీ, రక్తపరీక్షతో వ్యాధిని నిర్ధారణ చేయడానికి వీలుంది. 

చికిత్స ఉందా..?: చాలామందికి చికిత్స అవసరం పడకపోవచ్చు. కొంతమందికి మాత్రమే మందులు వాడాల్సి వస్తుంది. నాలుగు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. హైరిస్క్‌ వారికి మందులు వాడుతున్నారు. వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం రాదు. అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోవాలి. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటే వ్యాధి విస్తరణ ఉండదు. మాస్క్‌ ధరించడం అందరికీ మంచిది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని