Published : 13 Feb 2022 01:21 IST

monoclonal antibodies: కృత్రిమ యాంటీబాడీస్‌తో ప్రాణాలకు రక్షణ

క్యాన్సర్‌, కొవిడ్‌ నివారణ సాధ్యం

వ్యాధి నిరోధకత పెంపు 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: యాంటీబాడీలు అనే పదం కరోనా వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్‌, కరోనా నుంచి రక్షణ పొందాలంటే మందులు ఒక్కటే సరిపోకపోవచ్చు..అవి వేసుకున్నా ప్రాణాలు నిలుస్తాయని చెప్పలేం.. అనుకున్న మోతాదులో శరీరంలో యాంటీబాడీస్ లేకపోతే  వైద్యులు కూడా రక్షించలేరు. వైరస్‌కు వ్యతిరేకంగా పని చేసేందుకు క్యాన్సర్‌ నివారణలో కృత్రిమంగా  ఎప్పటి నుంచో మందులతో యాంటీ బాడీస్‌ తయారు చేస్తున్నారు. వీటినే మోనోక్లోనల్‌  యాంటీబాడీస్‌ అంటారు.  వీటిని ఎలా తయారు చేస్తున్నారో వైద్యులు  వివరించారు.

మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అంటే ఏమిటీ..?

మన శరీరంలో సాధారణంగా తయారు కావాల్సిన యాంటీబాడీస్‌ కొరత ఏర్పడినపుడు  మనకు కావాల్సినట్టు కృత్రిమంగా ల్యాబ్‌లో మందులతో ఉత్పత్తి చేస్తాం.  కొన్నిసార్లు మైస్‌ క్లోన్‌ నుంచి గానీ మానవాళి నుంచి ప్రోటీన్లను తీనుకొని పునరుత్పత్తి చేస్తున్నాం. వీటి రాకతో క్యాన్సర్‌పై పట్టు సాధించగలిగాం.

వీటిని ఏ వ్యాధుల చికిత్సలో ఎక్కువగా వినియోగిస్తున్నారు..?

క్యాన్సరుకు ఎక్కువగా వాడుతున్నాం. ఇంకా తీవ్రమైన రుమాటైడ్‌ అర్థటైటీస్‌, అస్థమా, కరోనా రోగులకు వినియోగిస్తున్నాం. ఫలితాలు కూడా బాగా వస్తున్నాయి.

మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ ఎలా పని చేస్తాయి..?

ఇందులో  మొదటిగా చెప్పుకోవాల్సింది ఫ్లాగింగ్‌. వైరస్‌, బ్యాక్టీరియా, క్యాన్సర్‌ కణాలు ఎక్కడున్నాయో తెలియజేస్తుంది. క్యాన్సర్‌ కణాలకు రక్త సరఫరా జరిగితే వాటి పరిధి పెరుగుతుంది.  వాటి విస్తృతిని ఫ్లాగింగ్‌ ఆపేస్తుంది. క్యాన్సర్‌ కణాలు తగ్గిపోవడానికి ఎంతో ఉపయోగపడుతాయి. క్యాన్సర్‌ కణాలు కరిగిపోవడానికి ఇచ్చే కీమోథెరపీకి అనుసంధానం చేసి పంపించి క్యాన్సర్‌ కణాలు కరిగి పోయేలా చేయవచ్చు.

ఎలాంటి క్యాన్సర్లపై బాగా పని చేస్తాయి...?

1997లో తొలిసారిగా రొమ్ముక్యాన్సర్‌కు కృత్రిమ యాంటీబాడీలు వాడిచూశారు. 25 శాతం ఎక్కువగా పని చేశాయి. దీన్ని విప్లవాత్మక మార్పుగా భావించారు. కొన్ని రకాల బ్లడ్‌ క్యాన్సర్లతో పాటు 15 నుంచి 20 క్యాన్సర్ల నివారణలో  కృత్రిమ యాంటీబాడీస్‌ను వినియోగిస్తున్నాం. అండాశయం, పెద్దపేగు, మెదడు, చర్మ, గొంతు, మెడపై క్యాన్సర్లకు ఎక్కువగా వాడుతున్నాం.

ప్రస్తుతం ఏ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అందుబాటులో ఉన్నాయి...?

రొమ్ముక్యాన్సర్‌కు ట్రాన్సుజమ్యాప్‌, పట్టుజమ్యాప్‌, టీడీఎం1 బాగా పని చేస్తున్నాయి.  నోటి క్యాన్సర్‌కు సంబంధించి సెటిక్స్‌ మ్యాప్‌, నిమోటిజమ్యాప్‌,నివోలి, పెంబ్రోలిజమ్‌ మ్యాప్‌ ఇమ్యునో ధెరపీ యాంటీబాడీస్‌ వాడుతున్నాం. జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, కిడ్నీ. పొట్ట, లివర్‌, బ్లాడర్‌, చర్మ క్యాన్సర్ల నివారణకు యాంటీబాడీస్‌ వినియోగిస్తున్నాం.

మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌తో సమస్యలున్నాయా..?

వీటి వినియోగంతో తొందరగా వచ్చే సమస్యల్లో హైపర్‌ సెన్సివిటీతో దద్దుర్లు, చెమటలు రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, జ్వరం వస్తుంది.  వంద మందిలో ఒక శాతం వారికి మాత్రమే ఇలాంటివి వస్తాయి. ఎక్కువ సార్లు యాంటీబాడీస్‌ వాడాల్సి వస్తే కొన్నిసార్లు ఊపిరి తిత్తులపై ప్రభావం చూపించవచ్చు.  జీర్ణ వ్యవస్థపై కూడా కొన్నిసార్లు ప్రభావం ఉంటుంది. డయేరియా రావచ్చు.  లివర్‌ పనితీరులో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. థెరాయిడ్‌, చర్మంపై శాశ్వతంగా దద్దులు ఉంటాయి. వీటన్నింటిని రోగులకు వైద్యులు ముందుగానే వివరిస్తారు.

భవిష్యత్తులో ఎలాంటి మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది...?

భవిష్యత్తులో ఎవరికి బాగా పని చేస్తాయి..? ఎవరికి పని చేయవో తెలుసుకుంటాం..ఏ రోగికి ఏ యాంటీబాడీస్‌ పని చేస్తాయో వైద్యులు ఆత్మ విశ్వాసంతో ఇవ్వగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలను తగ్గించడానికి వీలుంటుంది.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts