Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 26 Sep 2021 09:15 IST

1. భారత్‌కు రండి

‘సేవా పరమో ధర్మః అనే సూత్రంపై భారత్‌ నడుస్తుంది. అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే సొంతంగా కరోనాకు టీకాలను తయారు చేసింది. మానవాళి పట్ల బాధ్యతతో ప్రపంచంలో అవసరమైనవారికి టీకాల ఎగుమతిని మళ్లీ ప్రారంభించాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్త టీకా తయారీదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.. భారత్‌కు రండి... మా వద్ద వ్యాక్సిన్లను తయారు చేయండి’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  శనివారం వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌కు చేరుకున్న మోదీ.. ఐరాస 76వ సర్వ ప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించారు. 

మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల
జడ్‌ ప్లస్‌ భద్రత అంటే ఇదేనా?

2. భాగ్యనగరి.. అంకుర సిరి

విదేశాలకు వీడియో కాలింగ్‌పై ‘లిబరో మీట్‌’ యాప్‌ను రూపొందించిన ‘సోల్‌పేజ్‌’ సంస్థ, కార్లపై ప్రకటనల్ని పరిచయం చేసిన ఆడాన్మో, వర్టికల్‌ వ్యవసాయంతో గుర్తింపు పొందిన అర్బన్‌ కిసాన్‌.. ఇలాంటి అనేక అంకురాల(స్టార్టప్‌ల)కు ప్రోత్సాహం అందిస్తున్నాయి ఇంక్యుబేటర్లు. మార్కెట్లో రాణించేలా అనుభవజ్ఞుల సూచనలు, సలహాలతో యువత ఆలోచనలకు సాన పెడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి సాయం అందేందుకు తోడ్పడుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 30 దాకా ఇంక్యుబేటర్లు ఉన్నాయి.

3. మంతనాలు షురూ

ఏపీ రాష్ట్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త మంత్రిమండలి కూర్పుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాల వారీగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? వారి ప్రాధాన్యాలేంటి? సామాజిక సమీకరణాలు వంటి అంశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. వైకాపాలోని కొందరు ముఖ్యనేతలు, సీనియర్లతో దీనిపై ముఖ్యమంత్రి చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. సంక్రాంతికి కొత్త మంత్రిమండలి కొలువుదీరే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత సీఎం జగన్‌ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

4. ప్రజావసరాలకు అనుగుణంగా చట్టాలను సంస్కరించాలి

భారతీయ న్యాయవ్యవస్థను ప్రస్తుత కాలానికి, ప్రజావసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పునరుద్ఘాటించారు. గ్రామీణులు ఇప్పటికీ కోర్టులు ఉన్నది తమ కోసం కాదన్న భావనలో ఉన్నారని, దాన్ని దూరం చేసి న్యాయస్థానాలను, న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. న్యాయ యంత్రాంగాన్ని ప్రజానుకూలంగా తీర్చిదిద్దేలా న్యాయవ్యవస్థను మార్చకపోతే కోర్టులు ప్రజాసమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యాన్ని చేరుకోలేవన్నారు. శాసనవ్యవస్థ చట్టాలను సరిగా రూపొందిస్తే కోర్టులకు శాసనకర్తల పాత్ర పోషించాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

5. గులాబ్‌ గుబులు

ఉత్తరాంధ్ర జిల్లాలకు ‘గులాబ్‌’ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్‌ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది. అందులో... ‘తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

6. కన్నెత్తి చూస్తే కాలిపోతారు

‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్ట గొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడిపోయి... తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

7. దొంగల చేతికి తాళం.. మంకీ సర్వే

 ‘‘హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉంటున్న బల్వీందర్‌ సింగ్‌.. తన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఖాతాలో లావాదేవీలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అంతర్జాలంలో ఉన్న కస్టమర్‌ కేర్‌ నంబరుకు ఫోన్‌ చేశారు... అది సైబర్‌ నేరస్థులు ఉంచిన నకిలీ నంబరని తెలియదు. అవతలి వ్యక్తులు ‘మంకీ సర్వే’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బల్వీందర్‌కు చెప్పారు. తర్వాత డెబిట్‌ కార్డు వివరాలు పూర్తి చేయించి.. ఓటీపీ చెప్పమన్నారు. బల్వీందర్‌ ఓటీపీ చెప్పగానే ఆయన ఖాతాలోంచి రూ.4.5 లక్షలు నగదు మాయమైంది’’ ఇలా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరస్థులు వంచనకు దిగుతున్నారు. 

8. IPL 2021: సన్‌రైజర్స్‌ ఔట్‌

షార్జా పరుగులవరద పారే మైదానం. అలాంటి మైదానంలో హిట్టర్లకు పేరుపడ్డ పంజాబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగానే పరుగుల పండుగే అనుకున్నారంతా. ఫోర్లు, సిక్సర్ల వర్షం చూడబోతున్నామనుకుంటే.. సింగిల్స్‌ తీయడం కూడా కష్టమైపోయిందక్కడ. పంజాబ్‌ అతి కష్టం మీద 125 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది సన్‌రైజర్స్‌. బంతితో, బ్యాటుతో హోల్డర్‌ ఎంతో శ్రమించినా హైదరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. ఆ జట్టు ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

IPL 2021: ప్లేఆఫ్స్‌లో దిల్లీ!

9. ముంబై నుంచి గోవాకి.. ఓడలో విలాసంగా..!

ముంబై నగర విద్యుద్దీపకాంతుల అందాల్ని వీక్షిస్తూ జుహూ తీరంలోని సందడిని చూస్తూ గోవాలోని ప్రముఖ పర్యటక స్థలాల్ని సందర్శించేందుకు అరేబియా సాగరజలాల్లో విహరిస్తూ వెళ్లడం... అదీ విలాసవంతమైన ఓడలో వెళ్లడం... ఎంత బాగుంటుందో కదూ... కానీ అదెలా సాధ్యం అనుకోవద్దు. ఆ కోరిక తీర్చేందుకు స్వదేశీ క్రూజ్‌ సంస్థ అయిన కార్డిలియా, భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌తో అనుసంధానమై పనిచేస్తూ అటు పర్యటకుల్నీ, ఇటు డెస్టినేషన్‌ పెళ్లి వేదికగా అతిథుల్నీ ఆహ్వానిస్తోంది.

10. ఆటో డెబిట్‌ చెల్లింపులు.. 1 నుంచి నిబంధనలు మారుతున్నాయ్‌

చాలా మంది క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదార్లు తమ విద్యుత్‌, గ్యాస్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు (నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ తదితరాలు), బీమా చెల్లింపులు.. ఇలా పలు సేవలకు ఆటో-పేమెంట్‌ సూచనలను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. అయితే ఇవన్నీ ఇక జరగబోవు. ఇప్పటికే ఆ మేరకు బ్యాంకులు తమ వినియోగదార్లకు సమాచారాన్ని అందించడం మొదలుపెట్టాయి కూడా. ‘ఆర్‌బీఐ 20.09.21న జారీ చేసిన రికరింగ్‌ పేమెంట్‌ మార్గదర్శకాల ప్రకారం..మీ యాక్సిస్‌ కార్డులపై ప్రామాణిక సూచనల(స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌) ద్వారా చేస్తున్న లావాదేవీలు ఇక నిర్వహించలేం. మీరు నేరుగా మర్చంట్‌కే మీ కార్డు ద్వారా చెల్లింపులు చేయగలరు’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ తన వినియోగదార్లకు సమాచారం అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని