Top Ten News @ 9AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Published : 24 May 2021 08:56 IST

1. దూసుకొస్తున్న పెనుగండం

రాకాసి తుపాను దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. 45 ఏళ్లు పైబడిన వారికి నేటి నుంచి టీకా

హై రిస్క్‌ కేటగిరీకి చెంది 45 ఏళ్లు పైబడిన వారికి సోమవారం నుంచి మూడు రోజులపాటు వ్యాక్సినేషన్‌ కోసం జిల్లాల్లో కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్‌, పోర్టులు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, పాత్రికేయులను హైరిస్క్‌ కేటగిరీగా గుర్తించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆనందయ్య మందుపై అభ్యంతరం లేదు

ఆయుష్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వంశపారంపర్యంగా ఆయన ఈ మందు తయారుచేసి ఇస్తున్నారని, వీటిలో ఉపయోగిస్తున్న పదార్థాలతో హాని లేనట్లు వెల్లడైందని చెప్పారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌చేయండి 

4. జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ పరీక్షలు!

కరోనా తీవ్రత తగ్గితే జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వారికి చెప్పినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కొవిడ్‌ బాధితుల బిడ్డలకు మాదీ భరోసా

తల్లిదండ్రులు, సంరక్షకులు కొవిడ్‌ బారిన పడితే తాత్కాలికంగా వారి పిల్లల బాధ్యతను తాము తీసుకుంటున్నామని.. దురదృష్టవశాత్తు చిన్నారులెవరైనా అయినవాళ్లను కోల్పోయి అనాథలైతే వారిని తామే అక్కున చేర్చుకుని వారి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య తెలిపారు. భర్తను కోల్పోయి పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, చిన్నారుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, అంగన్‌వాడీ, చైల్డ్‌లైన్‌, కరోనా సహాయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. CCMB: మరణాలకు దారితీస్తున్న వైరస్‌లేంటి?

కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతిలో మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ మధ్య వయస్కులే ఎక్కువ మంది బలవుతుండడం మరింత భయపెడుతోంది. ప్రాణాలు పోవడానికి కొవిడ్‌తో పాటు ఇతరత్రా  అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయా? లేక ప్రత్యేకించి ఏదైనా వైరస్‌ రకం ప్రాణాంతకంగా మారిందా అనే దానిపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అధ్యయనం చేయబోతోంది. చనిపోయిన వ్యక్తుల వైరస్‌ నమూనాలపై  అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా రీ ఇన్‌ఫెక్షన్‌, బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌, మరణాల(మోర్టాలిటీ)కు దారితీస్తున్న రకాలపై పరిశోధించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. తెలుగులోనూ ఈకోర్ట్స్‌ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌

కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలిపే ‘ఈ-కోర్ట్స్‌ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌’ సేవలను సుప్రీంకోర్టు తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల కక్షిదారులు, సాధారణ ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, ప్రభుత్వ సంస్థలు కేసుల స్థితిగతులను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటివరకు ఈ యాప్‌ను 57 లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కరోనా పల్లెలకు అండగా ప్రవాసులు

కొవిడ్‌ రెండో దశ గ్రామీణ భారతాన్ని కకావికలం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినూత్న కార్యచరణతో ముందుకొచ్చారు ప్రవాస భారత వైద్యులు, నిపుణులు. పల్లెల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ‘ప్రాజెక్ట్‌ మదద్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ, ఆంధ్ర పల్లెల్లోని ఆర్‌ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందిస్తున్నారు. కరోనా లక్షణాలను గుర్తించడం, తేలికపాటి కేసులకు ఇంటివద్దే చికిత్స అందించడం, టీకాపై సలహాలు, ఓవర్‌ మెడికేషన్‌ ప్రమాదాలు, ఇతర ఉత్తమ పద్ధతులను రోగులకు వివరించడంలో వారికి ‘మదద్‌’ వైద్య బృందం తోడ్పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆక్సిజన్‌ డిమాండ్‌ తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో క్రమేపీ ఆక్సిజన్‌ డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. మే 9న 8,944 మెట్రిక్‌ టన్నుల మేర ఉన్న ఆక్సిజన్‌ సరఫరా తాజాగా 8,344 మె.టన్నులకు చేరినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇది తొలి ఉద్ధృతిలో సెప్టెంబరు 29న ఉపయోగించిన గరిష్ఠ పరిమాణం (3,095 మె.టన్నులు) కంటే 170% ఎక్కువే. మే 1న 7,603 మె.టన్నుల మేర ఉన్న సరఫరా ఆ తర్వాత వారం రోజులకు 8,920; మరో 3 రోజులకు 8,944 మె.టన్నులకు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Sports News: మిగతా ఐపీఎల్‌ యూఏఈలో..?

భారత్‌ వేదికగా మొదలైన ఐపీఎల్‌-14 కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. అయితే నిరవధికంగా వాయిదా పడ్డ ఈ టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నెల 29న జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వేదిక, తేదీలను బోర్డు ఖరారు చేసే అవకాశముంది. ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటన ముగిసిన తర్వాత సెప్టెంబరు-అక్టోబరులో టోర్నీని నిర్వహించడానికి బోర్డుకు వీలవుతుందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని