Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 27 Sep 2021 09:01 IST

1. తీరం దాటిన గులాబ్‌ తుపాను

రెండు రోజులుగా ఉత్తరాంధ్రను వణికించిన గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు  గార సమీపంలో కళింగపట్నం తీరాన్ని తాకిన తుపాను మరో మూడు గంటల తర్వాత తీరం దాటింది. ఈ  సమయంలో గంటకు 75 నుంచి 85 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

హడలెత్తిస్తున్న కడలి

2. Bharat Bandh: భారత్‌ బంద్‌.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది. ఈ బంద్‌లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ, తెదేపాతో పాటు పలు రైతు సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. 

3. IPL 2021: దంచేశాడు.. తిప్పేశాడు

ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం. పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఆ జట్టు ఆరో పరాజయాన్ని చవిచూసింది.  మ్యాక్స్‌వెల్‌ ఆల్‌రౌండ్‌ సత్తా చాటడంతో ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 54 పరుగుల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. 

4. 117 ఎకరాల ఈ-వేలం వాయిదా

తెలంగాణ ప్రభుత్వం మలి విడత భూముల వేలాన్ని వాయిదా వేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన భూముల వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచారశాఖ ముఖ్యకార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, గండిపేట మండలాల్లోని ఖానామెట్‌(22.79 ఎకరాలు), పుప్పాలగూడ(94.56 ఎకరాలు) గ్రామాల పరిధిలో 35 ల్యాండ్‌ పార్సిళ్లలో మొత్తం 117.35 ఎకరాల భూముల్ని ఈ-వేలం ద్వారా విక్రయించడానికి గత నెల 30న ప్రకటన ఇచ్చారు.

5. ‘అనంత’లో 16 టన్నుల బంగారం

ఏపీలోని పది చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ గుర్తించింది. ఇవన్నీ అనంతపురం జిల్లా పరిధి లోనివే! రాష్ట్ర గనులశాఖ పరిధిలో ఉండే ఖనిజాన్వేషణ విభాగం ఈ నిక్షేపాలపై అధ్యయనం చేసి గుర్తించింది. జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలోని రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

6. మన చేనేతకు జాతీయ గుర్తింపు

పుట్టపాక ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌ పది నెలలు శ్రమించి మగ్గంపై నేసిన ఈ చీర జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయుల్లో మూడుదశల్లో నిపుణుల బృందాలు పరిశీలించి, వడపోత అనంతరం రూపొందించిన జాబితాలో స్థానం దక్కించుకుంది.

7. గుట్టు‘చెప్పు’డు కాకుండా..

రాజస్థాన్‌లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్ష (రీట్‌)లో కొందరు అభ్యర్థులు ‘ఆధునిక రీతి’లో అక్రమాలకు తెర లేపారు. ‘బ్లూటూత్‌ అమర్చిన చెప్పులు’ ధరించి అవకతవకలకు పాల్పడ్డారు. ఈమేరకు బీకానేర్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు రీట్‌ అభ్యర్థులు కాగా మరో ఇద్దరు వారికి అతిచిన్న బ్లూటూత్‌ అమర్చిన చెప్పులను సమకూర్చారు.

8. రుచీపచీ లేని జీవితం!

కొవిడ్‌-19 బాధితుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం.. రుచి, వాసన చూసే సామర్థ్యం కోల్పోవడం. అయితే దాదాపు 10 శాతం మందిలో ఆరు నెలలు దాటాక కూడా పరిస్థితి అదేరీతిలో కొనసాగుతోంది. దీన్నిబట్టి.. ఇది ఆషామాషీ ఇబ్బంది కాదని, పెను సమస్యేనని వెల్లడైంది. దీర్ఘకాలంపాటు వాసన, రుచి విషయంలో ఎదురవుతున్న సమస్యల వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలపై బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. 

9. అమెజాన్‌ అంటే.. ఈస్టిండియా కంపెనీ 2.0

ఆన్‌లైన్‌ చెల్లింపుల (ఈ-కామర్స్‌) రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ అమెజాన్‌ అంటే ‘ఈస్టిండియా కంపెనీ 2.0’ లాంటిదేనంటూ ఆరెస్సెస్‌ అనుబంధ ‘పాంచజన్య’ వారపత్రిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పైపెచ్చు ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా ఉండేలా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తోందంటూ సంచలన విషయాలు వెల్లడించింది. 

10. Tollywood: ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్ కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌పై వెంకట్‌ పలు చిత్రాలు నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్‌, ఆటోనగర్‌ సూర్య, మిరపకాయ్‌, బిజినెస్‌మెన్‌, పైసా, పూలరంగడు చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని