Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 29 Sep 2021 09:05 IST

1. Huzurabad By Election: నువ్వా... నేనా..!

తెలంగాణలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు నెలలుగా ఇక్కడ రాజకీయ సందడి నెలకొంది. తెరాస, భాజపా అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.షెడ్యూల్‌ కూడా విడుదలవడంతో ప్రధాన పార్టీలు జోరు పెంచనున్నాయి.

బద్వేలు ఉప ఎన్నికకు అంతా సిద్ధం

2. Telugu Academy: తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో గోల్‌మాల్‌ జరిగింది. యూబీఐలో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్‌లో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు సోమవారం పోలీసులకు తెలిపారు.

3. విశాఖను వెంటాడుతున్న ముంపు

‘గులాబ్‌’ తుపాను ధాటికి విశాఖ నగరంలోని 88 లోతట్టు ప్రాంతాల్లోని వేల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వందలాది వాహనాలు నీట మునిగిపోయాయి. పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. వర్షాల తీవ్రత తగ్గడం, మంగళవారం నాటికి నీరంతా సమీప గెడ్డల్లోకి చేరడంతో ప్రజలు కొంత తేరుకున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

4. Bathukamma Sarees: 289 వర్ణాల్లో బతుకమ్మ చీరలు

తెలంగాణలో వచ్చే నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది.

5. 22 లక్షల మందికి రైతు బీమా వర్తించదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘రైతు జీవిత బీమా’ పథకం 22 లక్షల మంది అన్నదాతలకు అందని ద్రాక్షగా మారింది.  ప్రస్తుత వానాకాలం సీజన్‌కు మొత్తం 57.79 లక్షల మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నట్లు ధరణి పోర్టల్‌ ద్వారా రెవెన్యూశాఖ వ్యవసాయశాఖకు వివరాలిచ్చింది. వీరిలో 35.64 లక్షల మందికే ‘భారతీయ జీవిత బీమా సంస్థ’(ఎల్‌ఐసీ)కి గత నెల 14 నుంచి ఆర్నెల్ల కాలానికి జీవిత బీమాను వర్తింపజేస్తూ వ్యవసాయశాఖ ప్రీమియం చెల్లింది.

6. వాతావరణ మార్పుల నుంచి సాగుకు రక్షణ

వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యవసాయానికే కాకుండా మొత్తం పర్యావరణానికీ పెను సవాల్‌ను విసురుతున్నాయని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించుకునే యత్నాలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించే 35 రకాల నూతన వంగడాలను మంగళవారం ఆయన విడుదల చేశారు.

కలుపు మందును తట్టుకునే కొత్త వరి

7. నర్సులూ మందుల చీటీ రాస్తారు

ఇప్పటి వరకూ మందుల చీటీ(ప్రిస్క్రిప్షన్‌)ని వైద్యులు మాత్రమే రాస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇక నుంచి నర్సులకు కూడా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఆర్నెల్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయుల్లో ప్రాథమిక వైద్యంలో వినియోగించవచ్చని పేర్కొంది. 

రక్తపోటు, మధుమేహ వ్యాధి ఔషదాల ధర తగ్గింపు

8. గుండె.. లయ తప్పుతోంది!

పరుగులు పెడుతున్న నేటి జీవన పరిస్థితుల్లో ఎదురవుతున్న ఒత్తిడి, ఆందోళన గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం నిశ్శబ్దంగా వచ్చే గుండె నొప్పులు 45 శాతం వరకు ఉంటున్నాయి. స్త్రీలలోకన్నా పురుషుల్లో ఇది ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.  శరీరంలో ఉన్న రక్తనాళాలు చిన్నవి, పెద్దవి మూసుకు పోవటం వల్ల కూడా గుండెకు సరిగా రక్తం సరఫరాకాక సమస్యలు తలెత్తుతాయి. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణపాయం నుంచి బయట పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అవగాహనతో... గుండె పదిలం!

9. తోక పురాణం

తోక జాడించొద్దు అంటాం. తోక పట్టుకు తిరగొద్దంటాం. తోక తొక్కిన తాచులా లేచాడంటాం. మనిషికి తోక లేకపోయినా పూర్వ వాసనలు ఎక్కడికి పోతాయి? చుట్టూ ఉన్న జంతు ప్రపంచం అనుభవాలెక్కడికి పోతాయి? అందుకేనేమో రోజువారీ వ్యవహారాల్లో తోక ప్రస్తావన తరచూ వినిపిస్తూనే ఉంటుంది. దీని ప్రాముఖ్యతను గుర్తు చేస్తూనే ఉంటుంది. నిజానికి తోకల కథ 50 కోట్ల సంవత్సరాల క్రితమే మొదలైంది. మరి మనిషికి తోకెందుకు లేదు? పరిణామక్రమంలో మనిషి తోక ఎలా మాయమైంది? వీటిపై శాస్త్రరంగంలో రసవత్తర చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే దీనిపై ఓ కొత్త సంగతి బయటపడింది. 

10. IPL 2021: ముంబయి.. ఎట్టకేలకు

10 మ్యాచ్‌లు.. 4 విజయాలు.. 6 ఓటములు.. ఐపీఎల్‌-14లో ప్లేఆఫ్‌ బెర్తును ఆశిస్తున్న పంజాబ్‌, ముంబయి జట్ల పరిస్థితిది. వీటి మధ్య పోరులో ముంబయి పైచేయి సాధించింది. ఆ జట్టు మంగళవారం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అయిదో విజయంతో ముంబయి ప్లేఆఫ్‌ రేసులోకి కాస్త ముందంజ వేయగా.. ఏడో పరాజయంతో పంజాబ్‌ తన అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.

IPL 2021: సన్‌రైజర్స్‌తో వార్నర్‌ బంధానికి తెర?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని