Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Published : 01 Oct 2021 08:56 IST

1. నేడు శాసనసభ, మండలి పునఃప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి శుక్రవారం ఉదయం పునఃప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో హరితహారం, మండలిలో ఐటీ, పరిశ్రమలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. పర్యాటకులకు భరోసా కల్పించే బిల్లు,  తెలంగాణ జీఎస్‌టీ సవరణ, నల్సార్‌ చట్ట సవరణ, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ తదితర బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.

2. ఈ-కేవైసీ చేయించుకున్న వారికే ఇక రేషన్‌

ఈ-కేవైసీ చేయించుకున్న వారికే అక్టోబరు నుంచి రేషన్‌ ఇస్తారు. నమోదు చేయించుకోకుంటే ఇవ్వరు. అయిదు నుంచి 15 ఏళ్ల లోపు వారికి మాత్రం నెలాఖరు వరకు గడువు పొడిగింపు ఇచ్చినట్లు ఏపీ పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-కేవైసీ లేని వారికి రేషన్‌ నిలిపేసినా.. నమోదు చేయించుకుని వస్తే వెంటనే ఇస్తామని పేర్కొన్నారు.

3. జిల్లాకు ఒక నర్సింగ్‌ కళాశాల

సర్కారు వైద్యంలో నర్సుల కొరత ఎక్కువగా ఉంది. 30 మంది ఉండే వార్డుల్లో ఒక్కరే సేవలందిస్తున్న సందర్భాలు అనేకమున్నాయి. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకొక వైద్యకళాశాలను నెలకొల్పాలని ఇప్పటికే నిర్ణయించగా.. తాజాగా వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

* TSప్రతి లక్షమందికి పది పడకలు

* AP: లక్ష జనాభాకు.. 18 పడకలు 

4. తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల పర్వం

ప్రాజెక్టులపై ఏపీ, తెలంగాణల ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ గాలేరు-నగరి ప్రాజెక్టు విస్తరణ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గురువారం లేఖ రాశారు. ప్రస్తుతం ప్రాజెక్టు విస్తరణ చేపట్టడంతో పాటు స్వరూపాన్నే మారుస్తున్నారని, దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. మరోపక్క గోదావరి బేసిన్‌లో నీటి లభ్యతను అంచనావేసి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగేవరకు సీతారామ ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించవద్దని ఆంధ్రపద్రేశ్‌ గోదావరి బోర్డును కోరింది.

5. VOTE: ఇంటి నుంచే ఓటు వేసేలా..

ఓటింగ్‌ విధానంలో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంటోంది. మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), తెలంగాణ ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌, బొంబాయి ఐఐటీ, భిలాయ్‌ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ-ఓటింగ్‌ యాప్‌ తయారైంది. 

6. అమృత్‌ రెండోదశ నేటి నుంచి

పట్టణ ప్రాంత ప్రజలకు చెత్త నుంచి విముక్తితో పాటు తాగునీటి భద్రత కల్పించే రెండో దశ స్వచ్ఛ భారత్‌ (పట్టణ), అమృత్‌ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రూ.4.28 లక్షల కోట్ల వ్యయ అంచనాతో చేపడుతున్న ఈ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడం, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం వీటిని రూపొందించింది.

7. చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోతే బీమా దరఖాస్తు తిరస్కరించొచ్చు

వాహనానికి చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోతే బీమా క్లెయింను తిరస్కరించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. చోరీ అయిన ఓ కారుకు సంబంధించిన బీమా వివాదంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్‌ పత్రాల గడువు తీరి ఉండడంతో బీమా క్లెయింను తిరస్కరించింది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రాథమిక ఉల్లంఘన జరిగినట్లు తేలితే బీమా మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించొచ్చని స్పష్టం చేసింది.

8. Buy Now Pay Later: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి

కొన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించే విధానమే ఈ బీఎన్‌పీఎల్‌. ప్రస్తుతం ఎన్నో బీఎన్‌పీఎల్‌ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, వీటిలో ఏది మన అవసరాలకు సరిపోతుందనేది చూసి, ఎంచుకోవాలి.

Contact less cards: ఆ కార్డులతో జాగ్రత్త

9. ఆసియా నెంబర్‌ 2.. అదానీ

అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. గతేడాది కాలంగా రోజుకు రూ.1002 కోట్లు ఆర్జించారట. దీంతో గతేడాదితో పోలిస్తే ఈయన సంపద విలువ 261 శాతం పెరిగి రూ.5,05,900 కోట్లకు చేరింది. భారత్‌లోనే కాదు ఆసియాలోనే రెండో అగ్రగామి కుబేరుడిగా అదానీ నిలిచినట్లు గురువారం ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 100 మందితో రూపొందించిన రిచ్‌ లిస్ట్‌-2021 పేర్కొంది. 

10. IPL 2021: చెన్నై అడుగేసింది

చెన్నై సూపర్‌ కింగ్స్‌ దర్జాగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగానే తర్వాతి దశకు చేరుకుంది. జోరుమీదున్న ఆ జట్టు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటలు సాగలేదు. మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైనా.. ఆఖరి వరకు పోరాడినా సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో సూపర్‌కింగ్స్‌ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది. మరోవైపు హైదరాబాద్‌ 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదో ఓటమితో అధికారికంగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

ఆస్ట్రేలియాతో డేనైట్‌ టెస్టు: మెరిసిన మంధాన..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని