Corona: సెకండ్‌వేవ్‌లో ఇదే దారుణం!

ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాల రేటు 40శాతం అధికంగా ఉన్నట్లు మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

Published : 30 Jun 2021 01:14 IST

న్యూదిల్లీ: సుమారు ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్‌తో దేశ ప్రజలు తీవ్ర పోరాటం చేస్తున్నారు. మొదటి దశతో పోలిస్తే, ఇటీవల తగ్గుముఖం పట్టిన రెండో దశలోనే కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తాజా అధ్యయనం  చెబుతోంది. ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాల రేటు 40శాతం అధికంగా ఉన్నట్లు మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా యువత కరోనా బారిన పడి మరణించటం ఆందోళన కలిగించే విషయమని వివరించింది. మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఆధ్వర్యంలోని 13 ఆస్పత్రుల్లో ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ బాధితులు, మరణాలు గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలు తెలిపింది.

తొలిదశలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించటం, కఠిన ఆంక్షలతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఆ తర్వాత ఆంక్షలు సడలించడంతో మరోసారి కరోనా విజృంభించింది. దీంతో మళ్లీ రాష్ట్రాల వారీగా లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. అదే స్థాయిలో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగించింది. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో అత్యధికమంది డెల్టా వేరియంట్‌ బారిన పడ్డారు. మ్యాక్స్‌ ఆస్పత్రుల్లో నమోదైన వివరాల ప్రకారం మొదటి దశలో 7.2శాతంగా నమోదైన మరణాల రేటు రెండో దశలో 10.5శాతానికి చేరింది. పురుషుల్లో మొదటి, రెండో దశల్లో 7.2శాతం, 10.4శాతం ఉండగా, మహిళల్లో ఇది 9.8శాతం, 6.8శాతంగా నమోదైంది.

ఇక 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన కొవిడ్‌ బాధితుల్లో మరణాల రేటు 1.3శాతం నుంచి 4.1శాతానికి పెరిగింది. వెంటిలేటర్‌, ఐసీయూలో చికిత్స తీసుకునేవారి సంఖ్య రెండో దశలో పెరగడం గమనార్హం. ఆస్పత్రుల్లో పడకలు లభించకపోవడమూ కరోనా బాధితుల మరణాల పెరుగుదలకు కారణమైంది. ప్రతి ముగ్గురు కరోనా బాధితుల్లో ఒకరికి ఐసీయూ అవసరమైందని అధ్యయనం తెలిపింది. అదే విధంగా ఆక్సిజన్‌ అవసరం కూడా 63.4శాతం నుంచి 74.1శాతానికి పెరిగింది. ఇక కరోనా బాధితులకు అవసరమైన ఔషధాల విషయంలోనూ డిమాండ్‌ నెలకొందట. ముఖ్యంగా రెమ్‌డిసివర్‌ అవసరం 55.3శాతం నుంచి 74.4శాతానికి పెరిగిందని మ్యాక్స్‌ హాస్పటల్స్‌ అధ్యయనం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని