ఖరీదైన పావురం.. ధర ప్రస్తుతం ₹11.48కోట్లు!

కొంతమంది పావురాలను పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు పావురాల పందేల కోసం కొనుగోలు చేస్తుంటారు. కోడి, గుర్రెం పందేలలాగే ప్రపంచంలో చాలా చోట్ల పావురాలతోనూ రేసు పందేలు నిర్వహిస్తుంటారు. తమిళ నటుడు ధనుష్‌ నటించిన ‘మారి’ చిత్రం

Published : 11 Nov 2020 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతమంది పావురాలను పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు పావురాల పందేల కోసం కొనుగోలు చేస్తుంటారు. కోడి, గుర్రెం పందేలలాగే ప్రపంచంలో చాలా చోట్ల పావురాలతోనూ రేసు పందేలు నిర్వహిస్తుంటారు. తమిళ నటుడు ధనుష్‌ నటించిన ‘మారి’ చిత్రం చూశారా! అందులో ధనుష్‌, ఇతరులు ఇలా పావురాలతో పందేలు వేస్తుంటారు. ఇలాంటి పందేల్లో పాల్గొనేవారు ఉత్తమ జాతి పావురాలను ఎంచుకుంటారు. వాటి కొనుగోలుకు ఎంత ఖర్చయినా వెనకడుగు వేయరు. ఇలాంటి వారి కోసమే బెల్జియంలో ఓ సంస్థ రేసు పందేల్లో ఆరితేరిన పావురాల్ని.. కొత్తరకం జాతులను ఏటా వేలంలో విక్రయిస్తుంటుంది. ఇటీవల, ఈ సంస్థ ఓ పావురాన్ని వేలంలో పెట్టగా.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతోంది.

బెల్జియంకు చెందిన హొక్‌ వాన్‌ డె వూవెర్‌ అనే వ్యక్తి పందేల్లో వాడే పావురాలను సేకరించడం, కొత్త జాతి పావురాలను సృష్టించడం వంటివి చేస్తుంటాడు. అలా సృష్టించిన కొత్త జాతి పావురాలను, రేసుల్లో అనేక పథకాలు గెలిచిన కొన్ని పావురాలను ఇటీవల తన సంస్థ వెబ్‌సైట్ ‘pipa’‌ ద్వారా ఆన్‌లైన్‌లో వేలం పెట్టాడు. వీటిలో న్యూ కిమ్‌ పేరు గల పావురం ఒకటి. రెండేళ్ల వయసున్న ఈ పావురం ప్రాముఖ్యతను వెబ్‌సైట్‌లో వెల్లడించాడు. ఉత్తమ జాతి పావురం కావడంతో వేలంలో పాల్గొన్నవాళ్లు దీన్ని కైవసం చేసుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో ఈ పావురం ప్రారంభ ధర 237 డాలర్లు(దాదాపు రూ.17.5వేలు)ఉండగా.. ప్రస్తుతం 1.5మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.11.48 కోట్లు)పలుకుతోంది.

ఈ వేలం నవంబర్‌ 15న ముగియనుంది. అప్పటి వరకు ఎవరైనా సరే ప్రస్తుత ధరకు మించి వేలం పాడి పావురాన్ని గెలుచుకునే అవకాశముంది. అయితే ఇప్పటికే రూ.11.48కోట్ల ధరతో న్యూ కిమ్‌.. ప్రపంచంలోనే ఖరీదైన పావురంగా రికార్డు సృష్టించడం విశేషం. చాలా మంది ఇంతకు మించి వేలం పాడేందుకు ముందుకు రావట్లేదట. మరో ఐదు రోజుల్లో దీన్ని ఎవరు, ఎంతకు సొంతం చేసుకుంటారో తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన పావురంగా మారిన దీనికి ఓ సెక్యూరిటీ కంపెనీ ద్వారా భద్రత కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని