Viveka Murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరు

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను సీబీఐ అధికారుల బృందం విచారిస్తోంది.

Updated : 28 Jan 2023 16:26 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి సీబీఐ విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా.. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని సీబీఐ బృందం అవినాష్‌ రెడ్డిని ప్రశ్నిస్తోంది. ఆయన తరఫు న్యాయవాదిని అధికారులు గదిలోకి అనుమతించలేదు. సీబీఐ కార్యాలయానికి ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌ రెడ్డి, శ్రీనివాసులతో పాటు అవినాష్‌ అనుచరులు భారీగా చేరుకున్నారు.

మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరుకావాలని అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం 2.45 నిమిషాలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డితో పాటు న్యాయవాది నగేశ్‌ కూడా ఉన్నారు. అంతకుముందు తన విచారణను ఆడియో, వీడియోలు రికార్డు చేయాలని.. తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. అయితే, ఈ లేఖకు సంబంధించి అధికారులు సమాధానం ఇచ్చారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.

వివేకా హత్య కేసుకు సంబంధించి దాదాపు మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2019 మార్చిలో వివేకా హత్య జరిగినప్పటి నుంచి దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. ఇప్పటికే 248 మందిని ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఇంతమందిని ప్రశ్నించినప్పటికీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా అతనిపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే అవినాష్‌రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు