Viveka murder case: సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లి పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారని తెలిపారు.

Updated : 10 Mar 2023 18:45 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య (Viveka Murder case) కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinash reddy) సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని అడిగాం. రెండు, మూడుసార్లు అడిగినా స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లాం. కేసు విచారణ వెనక రాజకీయ కుట్రలున్నాయి. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. అధికారుల వద్ద ఉన్నందున ఇవాళ కోర్టులో జరిగిన విషయాలు నాకు తెలియదు. తప్పుడు ఆధారాలు సృష్టించి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలోనే చెప్పాను. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ  కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను పక్కన పెట్టి చిన్నచిన్న విషయాలను ప్రస్తావిస్తూ పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టుకథ అడ్డం పెట్టుకుని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. సీబీఐ విచారణ కంచే చేను మేసిన చందంగా ఉంది’’ అని అవినాష్‌రెడ్డి ఆరోపించారు.

అవినాష్‌కు ఓటేయండని వివేకా ప్రచారం చేశారు

‘ఎంపీ టికెట్‌’ కోసమే ఈ హత్య జరిగిందని చేస్తున్న ఆరోపణలు వింటే నవ్వొస్తుంది. చనిపోయే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటింటికీ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాంరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌కు ఓటేయండి అని ప్రచారం చేశారు. అక్కడి  ప్రజలను పిలిచి విచారణ చేయొచ్చు.. కానీ అలా చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డిని పిలిచి విచారణ చేయొచ్చు. అలా చేయలేదు. ఎవరిదగ్గర ఎలాంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. కేవలం వీళ్ల కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్స్‌ మాత్రమే తీసుకున్నారు. హత్యకు సంబంధంచిన నిజాలను వెలికితీయాలనే ఆలోచనే లేదు. కట్టుకథను అడ్డంపెట్టుకొని.. ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసుకొని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.

వివాహం కోసం పేరు మార్చుకున్నారు..

నా సోదరి సునీత నాపై ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్నా. ఈ విషయంలో వైకాపా కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు  ఇవాళ నేను భరోసా ఇస్తున్నా. వివేకా కుటుంబంలోనే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. వివేకానందరెడ్డికి 2006 నుంచి ఒకరితో సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం తన పేరును షేక్‌ మహమ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నారు. వారికి షేక్ షెహన్‌షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా షేక్ షెహన్‌షాను ప్రకటించాలని వివేకానందరెడ్డి దృఢంగా భావించారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

అవన్నీ ఆయన రాసిన వీలునామా అనుకుంటా..

హత్య జరిగిన తర్వాత కొన్ని సీల్డ్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తప్పకుండా అవి నోటరైజ్డ్‌ డాక్యుమెంట్లే.. అవి ఆయన రాసిన వీలునామా అని నేను అనుకుంటున్నాను. ఆయన రెండో భార్య, లేదా వారి అబ్బాయికి ఆయన ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం జరిగి ఉండొచ్చు. అయితే, ఈ ప్రక్రియను ఎవరు అడ్డుకోవాలనుకున్నారో? ఈ విషయంలో ఎవరికి ఆసక్తి ఉందో? అనేది తెలియాలి. ఈ కారణంతోనే వివేకానందరెడ్డిని హత్య చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కోర్టు, మీడియా ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇంతకాలం నేను మాట్లాడకపోవడానికి ఇవే కారణాలు తప్ప మరొకటి కాదు.  దీని వెనక ఉన్న రాజకీయ కుట్రలను ఛేదిస్తాం. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా’’ అని అవినాష్‌ రెడ్డి తెలిపారు.

ఆ లేఖ ఎందుకు దాచారు?

‘‘ వివేకా హత్య జరిగిన స్థలంలో ఒక లేఖ ఉంది. ఆ లేఖను వివేకా కుమార్తె సునీత భర్త రాజశేఖర్‌ తీసుకొని దాచిపెట్టారు. ఆ లేఖలో ఉన్న వివరాలు ఎవరికి చెప్పొద్దని పీఏ కృష్ణారెడ్డికి కచ్చితంగా చెప్పారు. లేఖను, సెల్‌ఫోన్‌ను దాచిపెట్టడం తప్పు కాదా? కనీసం పోలీసులకు అయినా చెప్పాలి కదా.. అదీ చేయలేదు. వారు ఎక్కడా బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. హత్య జరిగిన చోటుకి వెళ్లాలని వారు చెబితేనే నేను వెళ్లాను. ఆ లేఖ విషయం నాకు కూడా చెప్పలేదు. వివేకాది ముమ్మాటికీ హత్యేనని చెప్పడానికి ఈ లేఖ ఒక కీలకమైన ఆధారం. సరైన సమయంలో ఆ లేఖ విషయాన్ని బయట పెట్టకపోవడం అనేది ఈ కేసులో ఒక పెద్ద తప్పు. ఈ విషయంలోనూ అధికారులు దర్యాప్తు చేయాలి.

గుండెపోటుతో చనిపోయారని నేను చెప్పలేదు..

వివేకా గుండెపోటుతో చనిపోయారని నేను చెప్పలేదు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెదేపా అలా చిత్రీకరించింది. వివేకా కుటుంబసభ్యులు చెబితేనే నేను హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాను. అక్కడి పరిస్థితిని చూసి పోలీసులు, ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యమైన నాయకులకు సమాచారం అందించాను. నేను ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే నాపై సందేహం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. కానీ, నేను అలా చేయలేదు. నేను కచ్చితంగా బాధ్యతగానే వ్యవహరించాను. సమాచారం ఇవ్వడమే తప్పు అని అంటారని నేను ఊహించలేకపోయాను. ఈ కేసు విషయంలో నేను న్యాయపరంగానే ముందుకు వెళ్తాను’’ అని అవినాష్‌రెడ్డి తెలిపారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు